దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సూర్య, జ్యోతిక తమ వివాహ బంధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి పెళ్లి ప్రమాణాలు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో విదేశీ లొకేషన్‌లోని ఓ అందమైన చర్చిలో ఈ ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను జ్యోతిక సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ ప్రత్యేక వేడుకలో జ్యోతిక తెల్లటి వెడ్డింగ్ గౌన్‌లో ఎంతో ఎలిగెంట్‌గా కనిపించగా, సూర్య వైట్ సూట్ జాకెట్, బ్లాక్ ట్రౌజర్‌లో స్టైలిష్‌గా మెరిశారు. జ్యోతిక తన కుమారుడు దేవ్ చేయి పట్టుకుని ఐల్‌పై నడుచుకుంటూ రావడం, ఆమెను వెడ్డింగ్ గౌన్‌లో చూసిన సూర్య భావోద్వేగానికి గురికావడం వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. తమ 20 ఏళ్ల వైవాహిక ప్రయాణానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది.
ఈ క్యూట్ వీడియోను షేర్ చేసిన జ్యోతిక.. ‘ది సీక్వెల్ – మా 20 ఏళ్ల లవ్ అండ్ వార్ సెలబ్రేషన్’ అంటూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. ఇది కేవలం పర్‌ఫెక్ట్ మ్యారేజ్ సెలబ్రేషన్ కాదని, మనస్పర్థలు, సర్దుబాట్లు, త్యాగాలు, ఒకరిపై ఒకరికి ఉన్న నిస్వార్థ ప్రేమకు గుర్తుగా ఈ వేడుకను చేసుకున్నామని ఆమె పేర్కొన్నారు. పిల్లలు దియా, దేవ్, సూర్య సోదరుడు కార్తి, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సూర్య ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఆయన తదుపరి సినిమాలపై ఆసక్తి నెలకొంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నజ్రియా, నస్లెన్‌తో కలిసి సూర్య నటించనున్నట్లు సమాచారం. అలాగే టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న సూర్య 48 కూడా లైనప్‌లో ఉంది. వ్యక్తిగత జీవితంలో 20 ఏళ్ల బంధాన్ని ఇలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవడంతో సూర్య-జ్యోతిక అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.








