‘దాయ్‌రా’ దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా?

‘దాయ్‌రా’ దిశ కేసు ఆధారంగా తెరకెక్కిందా?

Summarize with AI

కరీనా కపూర్ ఖాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దాయ్‌రా’ (Daayra)పై ఆసక్తి నెలకొంది. జాతీయ అవార్డు గ్రహీత మేఘ్నా గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జంగ్లీ పిక్చర్స్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై వినీత్ జైన్, ధవల్ గడా సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ డీసీపీ రామన్ కుమార్‌గా, కరీనా డీసీపీ అజూని కోహ్లీగా పోలీస్ అధికారుల పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 15న విడుదలైన ట్రైలర్‌లోని కొన్ని సన్నివేశాలు 2019లో హైదరాబాద్‌లో చోటుచేసుకున్న వెటర్నరీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనతో పాటు అనంతరం జరిగిన పోలీస్ ఎన్‌కౌంటర్‌ను పోలి ఉండటంతో.. ఈ సినిమా ‘దిశ’ కేసు ఆధారంగా తెరకెక్కిందనే చర్చ మొదలైంది.

అయితే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకురాలు మేఘ్నా గుల్జార్ ఈ ఊహాగానాలకు స్పష్టత ఇచ్చారు. ‘దాయ్‌రా’ సినిమా 2019 హైదరాబాద్ దిశ కేసును నేరుగా ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రం కాదని ఆమె తెలిపారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న పలు నిజ జీవిత ఘటనల్లోని వివిధ అంశాలను తీసుకుని కథను రూపొందించినట్లు చెప్పారు. అందువల్ల ఈ చిత్రాన్ని ఒక నగరం, రాష్ట్రం లేదా నిర్దిష్ట పోలీస్ విభాగానికి సంబంధించిన కథగా చూడకూడదని ఆమె వివరించారు. 2019 ఘటనలో నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించగా, కాల్పుల్లో నలుగురు మృతి చెందినట్లు అప్పట్లో పోలీసులు వెల్లడించారు. ‘దాయ్‌రా’ కథలో ఆ ఘటనకు సంబంధించిన అంశాలు ఏ మేరకు ఉంటాయి? నిజ జీవిత ఘటనల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఏ దిశలో సాగుతుంది? అనే విషయాలపై సెప్టెంబర్ 18న సినిమా విడుదలైన తర్వాతే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment