టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా AI విస్తరణ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్న కంపెనీల జాబితాలో తాజాగా అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఒరాకిల్ చేరింది. బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. సంస్థ మరో విడత లేఆఫ్స్‌ను ప్రారంభించింది. ప్రభావిత ఉద్యోగులకు ఉదయం 6 గంటలకే ఈమెయిల్ ద్వారా ఉద్యోగ తొలగింపు సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన రోజే కొందరికి చివరి పని దినంగా పేర్కొన్నట్లు సమాచారం.
సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఉద్యోగాల కోతలు
ఇటీవల ఉద్యోగాలు కోల్పోయిన కొందరు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్‌ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వెల్లడించారు. ఉద్యోగులకు పంపిన అంతర్గత నోటిఫికేషన్‌లో సంస్థాగత మార్పుల్లో భాగంగా తమ పాత్రలు తొలగించినట్లు పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాజా విడతలో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు, AI, క్లౌడ్ మౌలిక సదుపాయాలపై కంపెనీ భారీగా పెట్టుబడులు పెడుతున్న సమయంలోనే ఈ లేఆఫ్స్ చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
AI, క్లౌడ్ కోసం భారీ పెట్టుబడులు.. మరోవైపు ఖర్చుల నియంత్రణ
AI, క్లౌడ్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు ఒరాకిల్ డేటా సెంటర్ల విస్తరణపై భారీగా ఖర్చు చేస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ మూలధన వ్యయం 28.5 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఏడాదిలో మూడు రెట్లకు పైగా పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 90–95 బిలియన్ డాలర్ల క్యాపెక్స్ అంచనాను కంపెనీ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో త్రైమాసికంలో 30 బిలియన్ డాలర్లకు పైగా అదనపు AI క్లౌడ్ కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు ఒరాకిల్ వెల్లడించింది. దీంతో మొత్తం Remaining Performance Obligations (RPO) 664 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఇప్పటికే 21 వేల ఉద్యోగాల కోత.. AI ప్రభావంపై చర్చ
ఒరాకిల్‌లో ఉద్యోగాల కోతలు ఇదే తొలిసారి కాదు. 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 21,000 ఉద్యోగాలను కంపెనీ తగ్గించినట్లు సమాచారం. ఇది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. మే 31తో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరం చివరికి కంపెనీలో సుమారు 1.41 లక్షల మంది ఉద్యోగులు ఉండగా.. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 1.62 లక్షలుగా ఉంది. ఉద్యోగుల తొలగింపులు, పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన సెవరెన్స్, ఇతర ఎగ్జిట్ ఖర్చుల కోసం కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 1.84 బిలియన్ డాలర్లు వెచ్చించింది. AI స్వీకరణ, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ కూడా ఉద్యోగుల సంఖ్య తగ్గడానికి కారణాలుగా పేర్కొంటున్న ఒరాకిల్.. భవిష్యత్‌లో ఖర్చులను మరింత నియంత్రించే చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవైపు AI ఆధారిత క్లౌడ్ వ్యాపారం కోసం భారీగా పెట్టుబడులు పెడుతూ.. మరోవైపు ఉద్యోగాల కోతల ద్వారా ఖర్చులను తగ్గిస్తున్న ఒరాకిల్ పరిస్థితి టెక్ రంగంలో AI తెస్తున్న మార్పులకు ఉదాహరణగా నిలుస్తోంది.








