తెలంగాణ శాసనసభ వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి భద్రతా ఏర్పాట్లను ధిక్కరించి ప్రవేశించేందుకు యత్నించిన ఘటనపై ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి ఫిర్యాదు మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు 14 మంది ఎమ్మెల్యేలు, పలువురు కీలక నేతలపై కేసులు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శంభీపూర్ రాజు, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సబితా ఇంద్రారెడ్డి, సంజయ్, విజయుడు, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి తదితరుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 121(1), 132, 74, 79, 351, 352, 353 రెడ్‌విత్ 3(5) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు కార్డన్‌ను దాటేందుకు నేతలు ప్రయత్నించడం, విధుల్లో ఉన్న పోలీసులను నెట్టివేయడం, కాలర్లు పట్టుకోవడం, దుర్భాషలాడటం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహిళా పోలీసు సిబ్బందిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి అవమానకరంగా ప్రవర్తించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్పీకర్ కులాన్ని ప్రస్తావిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి, తాతా మధును నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నేడు వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి వీడియో ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, మీడియా విజువల్స్‌ను పరిశీలించిన అనంతరం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.








