నటి శ్రుతిహాసన్ దాఖలు చేసిన AI డీప్‌ఫేక్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ఆమె ముఖాన్ని ఉపయోగించి రూపొందించిన నకిలీ, అశ్లీల వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోర్టు ఆదేశించింది. శ్రుతిహాసన్ అనుమతి లేకుండా ఆమె పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి బ్రాండ్ ప్రమోషన్లు, వస్తువుల విక్రయాలకు ఉపయోగించడంతో పాటు.. ఆమె ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు మార్ఫింగ్ చేశారంటూ గత ఆగస్టులో కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో తన పరువు, ప్రతిష్ఠకు నష్టం కలిగిందని పేర్కొంటూ రూ.15 కోట్ల నష్టపరిహారం కోరారు.
కేసును విచారించిన జస్టిస్ మాధవ్ జామదార్.. ఆన్లైన్లో ఇలాంటి తప్పుడు కంటెంట్ కొనసాగితే శ్రుతిహాసన్ ప్రతిష్ఠకు తీవ్ర, పూడ్చలేని నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నట్లు సమాచారం. కేవలం నష్టపరిహారం చెల్లించడం ద్వారా ఇలాంటి నష్టాన్ని భర్తీ చేయలేమని, వ్యక్తిగత గౌరవం, గోప్యతకు సంబంధించిన హక్కులకు ప్రాధాన్యత ఉందని కోర్టు అభిప్రాయపడింది. శ్రుతిహాసన్ గుర్తించిన డీప్‌ఫేక్ వీడియోలు, లింకులు, నకిలీ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. ఇదిలా ఉండగా.. శ్రుతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సలార్: పార్ట్ 2’తో పాటు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘ట్రెయిన్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.








