ప్రకృతి బీభత్సంతో అతలాకుతలమైన నేపాల్లో అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. భారీ వరదలు, కొండచరియల కారణంగా త్రిశూలి-3A హైడ్రోపవర్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులను 9 రోజుల తర్వాత సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 45 ఏళ్ల కబీర్ మహర్జన్, 30 ఏళ్ల సంజయ్ సాహ్లను నేపాల్ ఆర్మీ, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ఆధ్వర్యంలోని సంయుక్త బృందాలు రక్షించాయి. కబీర్ మెకానికల్ సూపర్వైజర్గా, సంజయ్ ఫోర్మన్గా పనిచేస్తున్నారు.
వరదలు, కొండచరియలతో టన్నెల్లో భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలు అత్యంత క్లిష్టంగా మారాయి. ప్రత్యేక పరికరాలతో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలకు టన్నెల్లో నుంచి కార్మికుల స్వరాలు వినిపించడంతో కీలకమైన ఆధారం లభించింది. వారితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన అనంతరం సహాయక బృందాలు రెస్క్యూ చర్యలను వేగవంతం చేసి తొలుత ఒకరిని, ఆ తర్వాత మరొకరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో సంభవించిన ఐస్-రాక్ అవలాంచ్ కారణంగా భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. ఉత్తర, మధ్య నేపాల్లోని పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం నాటికి ఈ విపత్తులో మృతుల సంఖ్య 1,282కు చేరుకోగా, 4,700 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ విపత్తు ప్రభావం పిల్లలు, ఉపాధ్యాయులపైనా తీవ్రంగా పడింది. రసువా జిల్లాలో సుమారు 280 మంది, నువాకోట్లో 300–350 మంది పిల్లలు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. బిదూర్ మున్సిపాలిటీలోనే సుమారు 250 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదు. రసువా, నువాకోట్ జిల్లాల్లో కలిపి 22 మంది ఉపాధ్యాయులు, విద్యా సిబ్బంది కూడా గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియకపోవడం నేపాల్లో విపత్తు తీవ్రతను స్పష్టం చేస్తోంది.








