‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే పాత్ర కలీన్ భయ్యా. అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టించిన ఈ క్రైమ్ డ్రామా ఇప్పుడు ‘మీర్జాపూర్: ది మూవీ’గా వెండితెరపైకి రాబోతోంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆగస్టు 31న ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం, కేవలం 24 గంటల్లోనే 38,460 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దేశవ్యాప్తంగా రూ.2.50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు తెలుస్తోంది. క్రేజ్‌కు తోడు కృష్ణాష్టమి సెలవు కూడా కలిసి రావడంతో తొలి రోజు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వెబ్ సిరీస్‌లో కలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా త్రిపాఠి వంటి పాత్రలు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. క్రైమ్, పవర్ పాలిటిక్స్, యాక్షన్, కుటుంబ వైరుధ్యాలతో కూడిన ‘మీర్జాపూర్’ ప్రపంచాన్ని ఇప్పుడు మరింత గ్రాండ్‌గా వెండితెరపై చూపించబోతున్నారు. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందు శర్మ, రవి కిషన్, జితేంద్ర కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 4న విడుదల కానుంది. థియేట్రికల్ రన్ ముగిసిన ఎనిమిది వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు ఓపెనింగ్ డే వసూళ్లలోనూ కొనసాగుతుందా? వెబ్ సిరీస్ స్థాయి క్రేజ్‌ను సినిమా థియేటర్లలో ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.








‘వెయ్యి రోజుల పాలనలో అన్నీ వైఫల్యాలే’.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్