మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు పుట్టా రవికుమార్‌పై బెంగళూరులో కిడ్నాప్ కేసు నమోదైంది. బెంగళూరు రాజరాజేశ్వరినగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేత, వ్యాపారవేత్త డాక్టర్ రవిప్రకాష్ భార్య సబీనా ఫిర్యాదు చేశారు. నాలుగు వాహనాల్లో వచ్చిన కొందరు వ్యక్తులు తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
రవిప్రకాష్ కిడ్నాప్‌కు గురైనట్లు ఆయన భార్య సబీనా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. నాలుగు వాహనాల్లో వచ్చిన వ్యక్తులు రవిప్రకాష్‌ను తీసుకెళ్లినట్లు ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదు ఆధారంగా రాజరాజేశ్వరినగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు పుట్టా రవికుమార్‌లను ఏ2, ఏ3 నిందితులుగా చేర్చారు. బెంగళూరులో బీజేపీ నేతను కిడ్నాప్ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు బీజేపీ నేత రవిప్రకాష్‌ను పోలీసులు మైదుకూరు పోలీస్ స్టేషన్‌లో హాజరుపర్చడం కీలకంగా మారింది. రవిప్రకాష్‌కు, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పుట్టా రవికుమార్‌కు మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదానికి సంబంధించి మురళీమోహన్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో రవిప్రకాష్‌పై మైదుకూరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.
జులైలో నమోదైన ఈ కేసులో తాజాగా రవిప్రకాష్‌ను మైదుకూరు కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో రవిప్రకాష్‌ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరులో నాలుగు వాహనాల్లో టీడీపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించాడని రవి ప్రకాష్ భార్య ఆరోపిస్తుండగా, కిడ్నాప్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మైదుకూరు పోలీసులకు అప్పగించారా..? లేక పోలీసులే మఫ్టీలో నాలుగు వాహనాల్లో వెళ్లి అదుపులోకి తీసుకున్నారా..? అనేది తేలాల్సి ఉంది.








