పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) నదియా(Nadia) జిల్లాలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు (India-Bangladesh Border) వద్ద భారీగా బంగారం (Gold) పట్టుబడింది. బన్‌పూర్ సరిహద్దు ప్రాంతంలో బంగారం అక్రమ రవాణాకు (Gold Smuggling) సంబంధించిన సమాచారంతో బీఎస్‌ఎఫ్ (BSF) 32వ బెటాలియన్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 15.607 కిలోల బంగారం లభించింది. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.24.95 కోట్లు ఉంటుందని బీఎస్‌ఎఫ్ అధికారులు అంచనా వేశారు.
ఈ ఘటనపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన బంగారం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి అప్పగించాల్సి ఉంది, అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో మహిళను విచారిస్తున్నారు. ఈ భారీ బంగారం స్వాధీనం వెనుక సరిహద్దు స్మగ్లింగ్ నెట్‌వర్క్ ప్రమేయం ఉందా అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం నిందితురాలిని కృష్ణగంజ్ పోలీసులకు (Krishnaganj Police) అప్పగించినట్లు అధికారులు తెలిపారు.








