సొంత కూతురు పెళ్లిని దగ్గరుండి చూడాలనుకున్న తల్లిదండ్రుల కోరిక తీరలేదు. కానీ, కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీ వారి ఆవేదనను కొంతైనా దూరం చేసింది. అమెరికాలో జరిగిన తమ కుమార్తె వివాహాన్ని ఆన్లైన్లో వీక్షిస్తూ.. ఇంటి నుంచే అక్షింతలు చల్లి ఆశీర్వదించారు తల్లిదండ్రులు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన జయరాజు, జ్యోతి దంపతులకు హిమబిందు ఏకైక కుమార్తె. హిమబిందు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. అక్కడే ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
శుక్రవారం రాత్రి అమెరికాలో హిమబిందు, రోహిత్ కుమార్ వివాహం జరిగింది. అయితే కుమార్తె పెళ్లికి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా హాజరుకాలేకపోయారు. దీంతో ఆ వివాహ వేడుకను ఆన్లైన్లో వీక్షించారు. పెళ్లి కార్యక్రమం జరుగుతున్న సమయంలో తమ ఇంటి నుంచే ఆన్లైన్లో కుమార్తెను చూస్తూ అక్షింతలు చల్లి ఆశీర్వదించారు.
కుమార్తె పెళ్లిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా.. ఆన్లైన్ ద్వారా వివాహ వేడుకలో భాగస్వాములయ్యారు. అనంతరం తమ గ్రామంలో బంధువులు, స్నేహితులు, అతిథుల కోసం జయరాజు, జ్యోతి దంపతులు పెళ్లి విందు ఏర్పాటు చేశారు.
టెక్నాలజీని ఉపయోగించుకుని దూరంగా ఉన్నా తమ కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న తల్లిదండ్రుల తీరు స్థానికంగా ఆసక్తికరంగా మారింది. కుమార్తె కొత్త జీవితానికి అడుగుపెడుతున్న వేళ.. ప్రత్యక్షంగా దగ్గర లేకపోయినా తమ ఆశీర్వాదాలను అందించారు.








