క్రికెట్లో మరో భారీ సంచలనం నమోదైంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న నమీబియా.. పటిష్టమైన సౌతాఫ్రికాకు షాకిచ్చింది. టీ20 ట్రై సిరీస్ 2026లో భాగంగా ఆగస్టు 28న విండ్హోక్లో జరిగిన మ్యాచ్‌లో నమీబియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఓపెనర్లు లారెన్ స్టీన్‌క్యాంప్ (41), జాన్ ఫ్రైలింక్ (60) అర్ధశతక భాగస్వామ్యంతో జట్టుకు మంచి ఆరంభం అందించారు. అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకే పరిమితమైంది. డెవాల్డ్ బ్రేవిస్ 75 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. నమీబియా బౌలర్లలో రూబెన్ ట్రంపెల్మన్, జేజే స్మిత్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
ఈ విజయంతో సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్‌లో నమీబియా తన 100 శాతం విజయాల రికార్డును కొనసాగించింది. ఇరు జట్లు ఇప్పటివరకు రెండుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లోనూ నమీబియానే గెలిచింది. 2025లో జరిగిన ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాను 4 పరుగుల తేడాతో ఓడించిన నమీబియా.. తాజాగా మరోసారి విజయం సాధించింది. దీంతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో సౌతాఫ్రికాను రెండుసార్లు ఓడించిన తొలి అసోసియేట్ జట్టుగా నమీబియా అరుదైన రికార్డు సృష్టించింది.








