ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం.
95 ఏళ్ల షావుకారు జానకి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం గత రాత్రి ఒక్కసారిగా క్షీణించడంతో ఐసీయూకు తరలించినట్లు సమాచారం.
వైద్యులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తూ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాలు వైద్యుల నుంచి అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. షావుకారు జానకి 1950లో విడుదలైన ‘షావుకారు’ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి సినిమానే ఆమెకు గుర్తింపు తీసుకురావడంతో ఆ సినిమా పేరే ఆమె ఇంటిపేరుగా మారింది.
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. తనదైన నటనతో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. దాదాపు 400 సినిమాల్లో నటించిన షావుకారు జానకి దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ సీనియర్ నటిగా గుర్తింపు పొందారు.
దశాబ్దాల పాటు విభిన్న పాత్రల్లో నటించిన ఆమెకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.








