హ‌మ్మ‌య్య, ఓ భ‌ర్త సేఫ్..! భార్య‌ స్కెచ్ బ‌ట్ట‌బ‌య‌లు

హ‌మ్మ‌య్య, ఓ భ‌ర్త సేఫ్..! భార్య‌ స్కెచ్ బ‌ట్ట‌బ‌య‌లు

Summarize with AI

“నా భర్తను యాక్సిడెంట్‌లో చంపేయ్.. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా” అని వాట్సాప్(WhatsApp), ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) భార్య తన ప్రియుడికి పంపిన సందేశాలివి. కట్టుకున్న భర్తను అంతమొందించేందుకు ఓ భార్య, తన ప్రియుడితో కలిసి వేసిన కిరాతక ప్లాన్ సోషల్ మీడియా చాటింగ్ ద్వారా బట్టబయలైంది. మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా డోర్నకల్ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ దారుణ సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

కథేంటంటే..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలకోడు గ్రామానికి చెందిన గాడే రాజేశ్వర్ రావుకు(Gade Rajeshwar Rao), సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానితో(Bhavani) 2016లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజేశ్వర్ రావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

అయితే, ఖమ్మంలో కొరియర్ డెలివరీ బాయ్‌గా(Courier Delivery Boy) పనిచేస్తున్న సైదులు అనే వ్యక్తితో భవానికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. రాజేశ్వర్ రావు (Rajeshwar Rao) విధులకు వెళ్లిన సమయంలో సైదులు తరచూ వీరి ఇంటికి వస్తూ పోతుండేవాడు.

గత నెల 27వ తేదీ మధ్యాహ్నం రాజేశ్వర్ రావు భోజనం కోసం అనూహ్యంగా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో తన భార్య భవాని మరొక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉండటాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యాడు. అనుమానం వచ్చి భార్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ఆమె ప్రియుడు సైదులుతో జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. “మన విషయం తెలిసిపోయింది.. నా భర్తను టార్గెట్ చేసి యాక్సిడెంట్‌లో చంపేయ్, లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా” అని భవాని మెసేజ్‌లు పంపినట్లు ఆధారాలతో సహా భర్త గుర్తించాడు.

ఈ దారుణంపై జులై 28న చిలకోడులో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ అనంతరం సమీప గ్రామంలో ఉన్న తన అన్నయ్యను తీసుకురావడానికి వెళ్తున్న రాజేశ్వర్ రావును ప్రియుడు సైదులు బైక్‌పై వెంబడించి బెదిరింపులకు దిగాడు.

తన భార్య భవాని, ఆమె ప్రియుడు సైదులు (Saidulu) కలిసి తనను ఎప్పుడైనా హత్య చేసే ప్రమాదం ఉందని, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని బాధితుడు రాజేశ్వర్ రావు పోలీసులను ఆశ్రయించాడు. అయితే, ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment