పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా యువత చేస్తున్న పోరాటానికి ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల మద్దతు ప్రకటించారు. విద్యార్థులు లేవనెత్తుతున్న డిమాండ్లలో న్యాయం ఉందని పేర్కొంటూ.. వారి పోరాట స్ఫూర్తికి చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు ఆసక్తికరంగా మారింది.
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి భరోసా ఇవ్వాలని విద్యార్థులు చేస్తున్న డిమాండ్లను శేఖర్ కమ్ముల ప్రస్తావించారు.
విద్యార్థులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కాదని శేఖర్ కమ్ముల అభిప్రాయపడ్డారు. ఇలాంటి చిన్న డిమాండ్లను సాధించుకోవడానికి లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తింటూ, రక్తమోడుస్తూ పోరాటం చేయాల్సి రావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తిండి, నిద్రను పక్కనపెట్టి.. దెబ్బలను తట్టుకుంటూ రాత్రి, పగలు అనే తేడా లేకుండా యువత ఉద్యమిస్తోందన్నారు. వారు ప్రభుత్వం నుంచి కోరుతున్నది జవాబుదారీతనమేనని, అందులో న్యాయం ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థుల గొంతును ప్రభుత్వం వినాలని శేఖర్ కమ్ముల కోరారు. వారి డిమాండ్లపై స్పందించి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. యువతలో కనిపిస్తున్న పోరాట స్ఫూర్తిని అణచివేయడం కాకుండా గెలిపించాలన్నారు. “మన పిల్లలు గెలిస్తే దేశం గెలిచినట్టు. మన పిల్లలు గెలిస్తే మనం బతికినట్టు. ప్రజలు గెలిస్తే ప్రభుత్వాలు గెలిచినట్టు” అంటూ శేఖర్ కమ్ముల తన పోస్టులో పేర్కొన్నారు.
చివరగా జెన్ జీ యువతను ఉద్దేశిస్తూ “డియర్ జెన్ జీ.. మీరు చేస్తున్న ఈ పోరాటానికి చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. నేను సెల్యూట్ చేస్తున్నా” అంటూ విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.








