ఏపీలో పోలీసుల వేధింపుల ఆత్మహత్య సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. విజయవాడ మొదలు.. కర్నూలు, నెల్లూరు.. తాజాగా పల్నాడు జిల్లాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగురాళ్లకు చెందిన దరియా హుస్సేన్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు ఆయన రాసిన సూసైడ్ నోట్, తీసుకున్న సెల్ఫీ వీడియో సంచలనంగా మారాయి. తన మరణానికి కారణం పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు అని, ఆయన వేధింపులు భరించలేకే చనిపోతున్నానని దరియా హుస్సేన్ సెల్ఫీ వీడియోలో వివరించారు.
దరియా హుస్సేన్ తన సూసైడ్ నోట్లో, సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల ప్రకారం.. తన ఇంటికి సంబంధించిన సివిల్ వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, పిడుగురాళ్ల సీఐ శ్రీరామ్ వెంకట్రావు తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ, అలా చేయకపోతే తనపై గంజాయి కేసు నమోదు చేస్తామని బెదిరించారని ఆరోపించారు.
అంతేకాకుండా, సీఐ చెప్పినట్టు వినకపోతే.. తన ఇంట్లో గంజాయి ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసు బుక్ చేస్తామని ఒక కానిస్టేబుల్ కూడా హెచ్చరించాడని సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకుని తనను, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని దురియా హుస్సేన్ తెలిపారు.
తన పుట్టినరోజు రోజునే మానసిక ప్రశాంతత కోల్పోయి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మరణానికి పూర్తి బాధ్యత పిడుగురాళ్ల సీఐ వెంకట్రావుదేనని స్పష్టం చేశారు.
దరియా హుస్సేన్ మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో, రాసిన సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయికృష్ణ లాకప్‌డెత్ తరువాత పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. రోజుకో కస్టోడియల్ టార్చర్ డెత్ ఘటన బయటపడుతుండడంతో పోలీస్ వ్యవస్థ పనితీరుపైనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖపై పర్యవేక్షణ లేదని, నిందితుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందనే చర్చ విస్తృతంగా జరుగుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
నా మరణానికి పూర్తి కారణం పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు గారే..
— Telugu Feed (@Telugufeedsite) July 16, 2026
ఆత్మహత్యకు ముందు దరియా హుసేన్ సెల్ఫీ వీడియో
సీఐ వెంకట్రావు, పోలీసుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా..
ఇంట్లో గంజాయి ప్యాకెట్లు వేసి కేసు బుక్ చేస్తామని కానిస్టేబుల్ బెదిరిస్తున్నారు
సివిల్… https://t.co/uWqedc4Cjw pic.twitter.com/jhANa1GEGB








