పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కాటేసిందంటూ సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలు అభిమానులను ఆందోళనకు గురి చేయగా.. తాజాగా వాటిపై రాజేష్ శర్మ వ్యక్తిగత సహాయకుడు సుభాశిష్ పాండా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు.
సుభాశిష్ పాండా విడుదల చేసిన వీడియోలో.. రాజేష్ శర్మకు ఎలాంటి విషపురుగు కాటేయలేదని, ఆయనకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ కూడా లేదని స్పష్టం చేశారు. చాలా కాలంగా ఉన్న షుగర్ సమస్య కారణంగా కాలు కొద్దిగా వాపు వచ్చిందని, వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రస్తుతం రాజేష్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు మంచి స్పందన లభిస్తోందని, మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు.
అంతేకాకుండా, హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో ఏదో ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని సుభాశిష్ పాండా ఖండించారు. “రాజేష్ శర్మ ఎక్కడికి వెళ్లినా నేను ఆయనతోనే ఉంటాను. హైదరాబాద్‌లో అలాంటి ఘటన ఏదీ జరగలేదు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరగా, నిజానిజాలు తెలుసుకోకుండా ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయవద్దని ప్రజలను, అభిమానులను సుభాశిష్ పాండా విజ్ఞప్తి చేశారు.








