ప్ర‌భుత్వానికి కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంచ‌ల‌న డిమాండ్‌

ప్ర‌భుత్వానికి కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంచ‌ల‌న డిమాండ్‌

Summarize with AI

కూట‌మి ప్ర‌భుత్వ(Alliance Government) తీరుపై, ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan)వ్య‌వహార శైలిపై కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు (Kapu Community Leaders) చాలా సీరియ‌స్‌గా ఉన్న విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌వ‌న్ కోసం కాళ్ల‌కు బ‌ల‌పం క‌ట్టుకొని తిరిగితే గెలిచిన త‌రువాత క‌నీసం కాపుల వంక క‌న్నెత్తి కూడా ప‌వ‌న్ చూడ‌డం లేద‌ని, సొంత సామాజిక‌వ‌ర్గంపై టీడీపీ(TDP) శ్రేణులు దాడికి పాల్ప‌డుతున్నా.. మిన్న‌కుండిపోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంచ‌ల‌న డిమాండ్‌తో కూట‌మి ప్ర‌భుత్వం ముందుకు వ‌చ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పదవి నుంచి తప్పుకుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను(Pawan Kalyan) ముఖ్యమంత్రిగా(CM) చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చలమల్ల ప్రసాదరావు (Chalamalla Prasada Rao) సంచలన ప్ర‌తిపాద‌న చేశారు. అది సాధ్యం కాకపోతే 2029 ఎన్నికల్లో పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని కోరారు.

2014, 2024 ఎన్నికల్లో కాపులు కూటమి విజయానికి పెద్దన్న పాత్ర పోషించారని, పవన్ పిలుపుతో 99 శాతం మంది కాపులు కూటమికి ఓటేశారని పేర్కొన్నారు. రెండేళ్లుగా అధికారంలో ఉన్న చంద్ర‌బాబు ప్రభుత్వం కాపులకు ఏమి చేసిందని కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి ప్ర‌శ్నిస్తోంది.

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 12 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి రిజర్వేషన్ కోటా పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీల తరహాలో కాపు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో (Manifesto) కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు రిజర్వేషన్లు ఇస్తామని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసినా ఇప్పటికీ అమలు చేయలేదని ఆరోపించారు.

వైసీపీ ప్ర‌భుత్వంలో(YSRCP Government) అమ‌లు చేసిన కాపు నేస్తం కూడా కూట‌మి ప్ర‌భుత్వంలో అమ‌లు కాక‌పోవ‌డంతో వారంతా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇవ్వడం లేదని, రిజర్వేషన్లపై పట్టించుకోవడం లేదని, కాపులపై దాడులు జరిగినా స్పందించడం లేదని, విదేశీ విద్య పథకం, కాపు భవనాల నిర్మాణం వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. వేల కోట్లతో రాజధాని నిర్మిస్తున్న ప్రభుత్వం కాపుల పట్ల వివక్ష చూపుతోందని మండిప‌డ్డారు.

కాపు ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండొద్దని, ఈ కులం వల్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాపులను ఎన్నికల్లో “కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని” ఆరోపించారు.

ప్రభుత్వానికి మూడు నెలల గడువు ఇస్తున్నామని, జూలై 27న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం “పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయాలి” అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా కాపు చైతన్య యాత్ర చేపడతామని, అవసరమైతే ప్రధాని నరేంద్ర మోదీని (Narendra Modi) కూడా కలుస్తామని చెప్పారు.

“మేమే గెలిపించుకున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మాకు లేదా? ప్రశ్నిస్తే వైసీపీ ముద్ర వేస్తున్నారు. కాపులకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి” అని చలమల్ల ప్రసాదరావు (Chalamalla Prasada Rao)వ్యాఖ్యానించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రత్యక్ష ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment