తెలంగాణలో (Telangana) నీటి నిర్వహణ(Water Management), కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) అంశాలపై బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నదుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ పంపులు నడపకపోవడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని (Uttam Kumar Reddy) లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ.. “నదుల్లో నీళ్లు ఉన్నా వాటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నడపకపోవడం నేరపూరిత నిర్లక్ష్యం. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు” అని విమర్శించారు.
దేవాదుల ప్రాజెక్టు (Devadula Project) వద్ద పంపులు ఎందుకు ఆన్ చేయడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. “అక్కడ ఎన్‌డీఎస్‌ఏ (NDSA) అభ్యంతరాలు లేవు. అయినా నీటిని ఎత్తిపోసే చర్యలు ఎందుకు చేపట్టడం లేదు? నీళ్లు ఉండి కూడా ఎత్తకపోవడానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. సమ్మక్క బ్యారేజ్ (Sammakka Barrage) వద్ద లక్షా 8 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, రామప్ప రిజర్వాయర్‌ను నింపుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని ఆరోపించారు.
మేడిగడ్డ (Medigadda Barrage), అన్నారం (Annaram Barrage), సుందిళ్ల బ్యారేజీల (Sundilla Barrage) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ప్రతికూల దృక్పథంతో వ్యవహరిస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్(KCR) హయాంలో నిర్మించిన మౌలిక సదుపాయాలను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. “రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రతి అబద్ధానికి, ప్రతి మాటకు ఆధారాలతో సమాధానం చెబుతాను. ఎవరైనా చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నాను. అసెంబ్లీ నిర్వహిస్తే అక్కడే అన్ని విషయాలు వివరిస్తాను” అని హరీశ్‌రావు అన్నారు. “అబద్ధాలు చెప్పడంలో బహుమతి ఇస్తే రేవంత్‌రెడ్డికే నోబెల్ బహుమతి వస్తుంది” అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్, ఉత్తమ్ ని ఉరి వేసినా తప్పులేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.








