సముద్రంలో(Sea) గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల(Fishermen) కోసం మూడు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ముగిసినా వారి ఆచూకీ లభించలేదు. సుమారు 72 గంటల పాటు కోస్ట్ గార్డ్(Coast Guard), నేవీ(Navy), ఇతర విభాగాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్(Search Operation) ముగిసిన తర్వాత కూడా ఎలాంటి సమాచారం దొరకకపోవడంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన మరింత పెరిగింది.
విశాఖ హార్బర్(Visakhapatnam Harbour) వద్దే నిరీక్షిస్తున్న కుటుంబ సభ్యులు తమ వారిని సురక్షితంగా గుర్తించాలని అధికారులను వేడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందోనని ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. బోటు ప్రమాదంపై ఫిషరీస్ కమిషనర్ (Fisheries Commissioner) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన విషయం తనకు ఈ నెల 5వ తేదీ ఉదయం తెలిసిందన్నారు. సమాచారం అందిన వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు కోస్ట్ గార్డ్ అధికారులకు లేఖలు రాసి గాలింపు చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.
విశాఖపట్నంలోని(Visakhapatnam) కోస్ట్ గార్డ్ నౌక మరమ్మతుల్లో ఉండటంతో కాకినాడ (Kakinada) నుంచి మరో నౌకను రప్పించి గాలింపు నిర్వహించినట్లు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటి వరకు గల్లంతైన వారిలో ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదని వెల్లడించారు. అలాగే ప్రమాదంపై వాస్తవాలు తెలుసుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినట్లు, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
సెర్చ్ ఆపరేషన్ ముగిసినా గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు స్పష్టమైన సమాధానం లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తమ కుటుంబ సభ్యుల పరిస్థితిపై అధికారిక సమాచారం ఇవ్వాలని, గాలింపు చర్యల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని బాధితులు కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్రతిపక్షాలు, మత్స్యకార సంఘాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే మరింత విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 72 గంటల గాలింపు అనంతరం కూడా ఆచూకీ ఎందుకు లభించలేదు?, గాలింపు చర్యలు తగిన స్థాయిలో జరిగాయా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర వివరణ రావాల్సి ఉంది.








