నేషనల్ అవార్డ్ విజేత, స్టార్ హీరో ధనుష్ (Dhanush) పేరు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ (Tamil Nadu Politics) హాట్ టాపిక్‌గా మారింది. ఆయన అభిమాన సంఘం ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (All India Dhanush Fans Welfare Association) తాజాగా ఆవిష్కరించిన అధికారిక జెండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ధనుష్ చిత్రంతో పాటు ఎరుపు-తెలుపు (Red White) రంగుల కలయికలో రూపొందించిన ఈ జెండా (Flag) రాజకీయ పార్టీ జెండాను తలపించేలా ఉండటంతో కొత్త చర్చకు తెరలేచింది. దీంతో దళపతి విజయ్ (Thalapathy Vijay) బాటలోనే ధనుష్ కూడా త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉండగా, అభిమాన సంఘాలను రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఫ్యాన్స్ నేతలకు సూచనలు వెళ్లినట్లు సమాచారం. విజయ్(Vijay) కూడా మొదట అభిమాన సంఘాల ద్వారానే క్షేత్రస్థాయిలో బలం పెంచుకుని, ఆ తర్వాత రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ధనుష్ ఫ్యాన్స్ కొత్త జెండా వెనుక కూడా రాజకీయ వ్యూహం ఉందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారాలపై ధనుష్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన నిజంగానే రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమవుతున్నారా? లేక ఇది అభిమాన సంఘం చేపట్టిన సాధారణ కార్యక్రమమేనా? అన్నది రానున్న రోజుల్లో స్పష్టత రానుంది.








