భక్తులు పెరుగుతుంటే.. హుండీ ఆదాయానికి గండి?

భక్తులు పెరుగుతుంటే.. హుండీ ఆదాయానికి గండి?

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో(Temples) భక్తుల (Devotees) రద్దీ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ హుండీ ఆదాయం(Hundi Revenue), మిగులు ఆదాయం (Income) కొన్ని చోట్ల తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో హుండీ లెక్కింపులో అక్రమాలు, దర్శన టిక్కెట్ల దందా, ఆలయ ఆభరణాల భద్రతలో లోపాలు, బంగారం చోరీ యత్నాలు వంటి ఘటనలు వరుసగా వెలుగులోకి రావడం దేవాదాయ శాఖ (Endowments Department) పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆదాయం ఎందుకు పెరగడం లేదనే అంశంపై సమగ్ర విచారణ అవసరమనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

విజయవాడ దుర్గగుడిలో (Vijayawada Kanaka Durga Temple) 2023-24లో 93.40 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా రూ.156.97 కోట్ల మిగులు ఆదాయం నమోదైంది. అయితే 2025-26లో భక్తుల సంఖ్య 1.19 కోట్లకు పెరిగినా మిగులు ఆదాయం రూ.140.99 కోట్లకు తగ్గినట్లు నమోదైంది. అంటే దాదాపు 25 లక్షల మంది అదనంగా వచ్చినప్పటికీ ఆదాయం తగ్గడం చర్చనీయాంశంగా మారింది.

అలాగే అన్నవరం (Annavaram) శ్రీసత్యనారాయణస్వామి (Sri Satyanarayana Swamy) ఆలయంలో 2023-24లో 45.50 లక్షల మంది భక్తులతో రూ.84.82 కోట్ల మిగులు ఆదాయం నమోదవగా, 2025-26లో 57.87 లక్షల మంది భక్తులు వచ్చినప్పటికీ ఆదాయం రూ.82.80 కోట్లకే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే పెనుగంచిప్రోలు, పెదకాకాని వంటి ఇతర దేవాదాయ శాఖ ఆలయాల్లో కూడా ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోందని అధికారిక లెక్కలు సూచిస్తున్నాయి.

దర్శన టిక్కెట్లు(Darshan Tickets), గదుల కేటాయింపును డిజిటల్ సేవల ద్వారా అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అన్నవరం ఆలయంలో ప్రత్యక్ష టికెట్ కౌంటర్లను గణనీయంగా తగ్గించి డిజిటల్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనివల్ల కొందరు మధ్యవర్తులు, బ్రోకర్లు భక్తులను లక్ష్యంగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వరుసగా బయటపడుతున్న ఘటనలు

గత రెండేళ్లలో రాష్ట్రంలోని పలు ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలు భక్తులను ఆందోళనకు గురిచేశాయి.

  • విజయవాడ దుర్గగుడిలో హుండీ లెక్కింపు సమయంలో బంగారు కానుకల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఓ ఉద్యోగి పట్టుబడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల వ్యవధిలో దుర్గగుడిలో దర్శన టిక్కెట్లను మళ్లీ విక్రయించే ప్రయత్నాలు మూడుసార్లు బయటపడ్డాయి. ఇందులో సెక్యూరిటీ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు పట్టుబడినట్లు సమాచారం. విజయవాడ యనమలకుదురు ఆలయంలో హుండీ లెక్కింపులో అక్రమాలపై పోలీసు కేసు నమోదైంది.
  • అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఓ వాలంటీరు రూ.11,500 నగదును చోరీ చేయడానికి ప్రయత్నిస్తుండగా సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు.
  • తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి బంగారు బిస్కెట్‌ను అక్రమంగా తరలించే ప్రయత్నంలో విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. దర్యాప్తులో అతని వద్ద నుంచి 655 గ్రాముల బంగారం, 157 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
  • కృష్ణా జిల్లా గుడివాడ శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో దాదాపు కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయమైందన్న ఘటన సంచలనం సృష్టించింది. అనంతరం అది ప్రైవేట్ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టినట్లు సమాచారం రావడంతో దేవాదాయ శాఖ విచారణ ప్రారంభించింది.
  • శ్రీకాళహస్తి ఆలయంలో వెండి పడగల అక్రమాలపై కూడా ఆరోపణలు వెలువడటం భక్తుల్లో ఆందోళన పెంచింది.

భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆదాయం ఎందుకు తగ్గుతోంది? వరుసగా బయటపడుతున్న అక్రమాలు ఒక్కొక్కటేనా? లేక వ్యవస్థలో లోపాలకు సంకేతమా? హుండీ లెక్కింపు, దర్శన టిక్కెట్ల జారీ, ఆలయ ఆభరణాల భద్రత, డిజిటల్ సేవల అమలుపై ప్రభుత్వం లేదా దేవాదాయ శాఖ సమగ్ర ఆడిట్ నిర్వహిస్తుందా? బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.

ఆలయాలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే పారదర్శకత, కఠిన పర్యవేక్షణ, అక్రమాలపై వేగవంతమైన చర్యలు అత్యవసరమని భక్తులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment