ప్రశ్న రావణ్‌.. అరెస్ట్.. విడుదల.. వెంటనే అరెస్ట్

ప్రశ్న రావణ్‌.. అరెస్ట్.. విడుదల.. వెంటనే అరెస్ట్

Summarize with AI

యూట్యూబర్ ‘ప్రశ్న రావణ్’(Prashna Ravana) అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం (Coalition Government) ఆయనపై రాజకీయ కక్షసాధింపున‌కు పాల్పడుతోందంటూ దళిత సంఘాలు మండిపడుతున్నారు. కోర్టులో ఒక కేసులో బెయిల్(Bail) వ‌చ్చిన వెంట‌నే, పోలీసులు మరో స్టేషన్ పరిధిలోని కేసును తెరపైకి తెచ్చి అరెస్ట్ చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకొక పోలీస్ స్టేషన్ తిప్పుతూ రావణ్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

గత నెల 30న హైదరాబాద్‌లో (Hyderabad) ప్రశ్న రావణ్‌ను (Prashna Ravana)పిఠాపురం పోలీసులు (Pithapuram Police) అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై (Pawan Kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగింది. జూలై 1న రావణ్‌ను పిఠాపురం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే, అక్కడ న్యాయమూర్తి రిమాండ్‌ను రిజెక్ట్ చేయడంతో ఆయనకు ఉపశమనం లభించింది.

కానీ, న్యాయస్థానం నుంచి బయటకు రాకముందే సర్పవరం పోలీసులు మరో పాత కేసు పేరుతో రావణ్‌ను తక్షణమే అరెస్ట్ (Arrest) చేశారు. నిన్న సాయంత్రం సర్పవరం పోలీసులు ఆయనను కాకినాడ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అక్కడ కూడా సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు రిమాండ్ రిజెక్ట్ చేయడంతో పాటు బెయిల్(Bail) మంజూరు చేసింది.

సర్పవరం కేసులోనూ రిమాండ్ రిజెక్ట్ కాగానే, కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీసులు రంగంలోకి దిగారు. నిన్న ఉదయం మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్‌ఛార్జ్ ఉడుముల బుజ్జి (Udumula Bujji).. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇనగుదురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఇనగుదురు పోలీసులు, కాకినాడ కోర్టు (Kakinada Court) వద్దే రావణ్‌ను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆయనను మచిలీపట్నంలోని ఇనగుదురు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వెల్లువెత్తుతున్న నిరసనలు
ఒక కేసులో కోర్టు బెయిల్ ఇవ్వగానే, మరో కేసుతో నిమిషాల వ్యవధిలో అరెస్ట్ చేస్తూ చట్టాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని దళిత సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జైభీమ్ రావ్ భారత్ పార్టీ (Jai Bhim Rao Bharat Party) అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) ఈ పరిణామాలపై స్పందిస్తూ.. ఇది పక్కా రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రావణ్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment