ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవికతే ముఖ్యం – సీఎం రేవంత్

ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవికతే ముఖ్యం - సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (Telangana State Budget) రూపకల్పన (Preparation, ఆదాయ సమీకరణపై (Revenue Mobilisation) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర బడ్జెట్ (State Budget) లక్ష్యాలకు అనుగుణంగా నిధులు సాధించాలంటే అధికారులు ఆదాయ సమీకరణపై సీరియస్‌గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల పనితీరు, రాబోయే బడ్జెట్ వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంలో ఎక్కడా, ఎలాంటి లీకేజీలు లేకుండా కఠిన జాగ్రత్తలు వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యంగా HMDA, TGIIC, కమర్షియల్ ట్యాక్సెస్(Commercial Taxes), ఎక్సైజ్ (Excise) శాఖలతో పాటు ఆదాయాన్ని తెచ్చే వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఆదాయ సమీకరణను నిరంతరం ఫాలో అప్ చేసేందుకు వీలుగా ఒక ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ను (Chasing Cell) ఏర్పాటు చేసుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

ప్రభుత్వం అనుకుంటున్న స్థాయిలో సంక్షేమ (Welfare), అభివృద్ధి (Development) పనులు జరగాలంటే శాఖలవారీగా డిపార్ట్‌మెంట్స్ తమ సామర్థ్యాన్ని (Capacity) మరింతగా మెరుగుపరుచుకోవాలని హితవు పలికారు. నిధుల సమీకరణ, ఆదాయం పెంపు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, అధికారులు అలసత్వాన్ని వీడాల్సిందేనని తేల్చిచెప్పారు.

ప్రభుత్వ పధకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా, అదే సమయంలో దుర్వినియోగం కాకుండా ఉండేందుకు సరికొత్త సాంకేతికతను (Technology) వాడాలని సీఎం సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేయాలని, దానిని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) కి అనుసంధానం చేసుకోవాలని ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పారదర్శకంగా వెళ్తాయని పేర్కొన్నారు.

“గాల్లో దీపాల్లాంటి ఊహాజనిత బడ్జెట్ వద్దు.. వాస్తవికత ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించుకోవాలి” అని సీఎం ఖరాఖండిగా చెప్పారు. రాష్ట్ర ప్రగతి కోసం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు వివిధ శాఖలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖతో పాటు పలు కీలక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment