విమర్శలు, విడాకులు, డిజాస్టర్లను దాటి.. సరికొత్త సామ్రాజ్యం

విమర్శలు, విడాకులు, డిజాస్టర్లను దాటి.. సరికొత్త సామ్రాజ్యం

చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక కెరీర్ గ్రాఫ్ పడిపోవడం మొదలైతే.. ఇక ఆమె పని అయిపోయింది అనుకోవడం ట్రేడ్ వర్గాలకు, నెటిజన్లకు అలవాటే. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు, వరుస ఫ్లాపులు చుట్టుముడితే ఆ హీరోయిన్‌ మళ్లీ నిలదొక్కుకోవడం అసాధ్యం అనుకున్నారు. కానీ, వాటన్నింటినీ తుత్తునియలు చేస్తూ.. ఫీనిక్స్ పక్షిలా పైకి లేచింది సమంత.

ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ చెన్నై సొగసరి.. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే, “సామ్ ఈజ్ బ్యాక్.. అండ్ దిస్ టైమ్ షి ఈజ్ రూలింగ్” అనక తప్పడం లేదు.

‘ఏ మాయ చేశావె’లో జెస్సీగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న‌ సమంత.. ఆ తర్వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్స్ సరసన నటిస్తూ టాలీవుడ్ నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి వరకు అంతా ఒక అందమైన సినిమా కథలా సాగింది. కానీ, నాలుగేళ్లకే ఆ బంధం ముక్కలవడంతో సమంత జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. విడాకులకు కారణం సమంతేనంటూ నెట్టింట కొందరు నెటిజన్లు చేసిన ట్రోలింగ్, నెగిటివిటీ ఆమెను మానసికంగా ఎంతో కుంగదీశాయి.

వ్యక్తిగత బాధల మధ్యే మైయ‌సైటిస్ (Myositis) అనే అరుదైన వ్యాధి బారిన పడడం సమంతను మరింత బలహీనపరిచింది. 2022లో భారీ అంచనాలతో వచ్చిన ‘శాకుంతలం’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రమోషన్ల వేళ సామ్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలను చూపిస్తూ.. ఆమెను మరింత టార్గెట్ చేశారు.

విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’ యావరేజ్‌గా నిలిచింది. ఓటీటీలో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తెచ్చిన క్రేజ్.. ‘హనీ బన్నీ’ సిరీస్ ఫ్లాప్‌తో ఆవిరైపోయింది. మధ్యలోనే ‘రక్త బ్రహ్మాండ’ సిరీస్ ఆగిపోవడంతో.. సమంత పని ఇక అయిపోయిందని చాలామంది ఫిక్స్ అయిపోయారు.

ఎక్కడైతే కోల్పోయిందో, అక్కడే వెతుక్కోవాలనే పట్టుదలతో సమంత రూట్ మార్చింది. తానే నిర్మాతగా మారి ‘శుభం’ అనే సినిమా నిర్మించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా, ఆమె ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు. గతేడాది డిసెంబరులో తనను ‘ఫ్యామిలీ మ్యాన్’తో బాలీవుడ్‌లో నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది సమంత. పెళ్లయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లో దూకేసింది.

తెలుగు ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మార్కెట్ తక్కువ. దానికి తోడు జూన్ నెల మిడ్ సీజన్‌లో రిలీజ్ పెట్టుకోవడంతో ట్రేడ్ వర్గాలు పెదవి విరిచాయి. కానీ, థియేటర్లలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. అద్భుతమైన కంటెంట్, సమంత నటనతో ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 50 కోట్ల క్లబ్‌ లో చేరిపోయింది. ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడంతో, లాంగ్ రన్‌లో ఈ చిత్రం రూ. 70 నుంచి 80 కోట్ల వసూళ్లు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

కెరీర్ పరంగా ఇండస్ట్రీ మైండ్ బ్లాక్ అయ్యేలా కమ్‌బ్యాక్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉందనే వార్త అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో సంతోషాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌ను ఒకేసారి అందుకుంటూ సమంత నిజమైన ‘విజేత’గా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment