“చంద్రబాబు,మోడీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం”

“చంద్రబాబు,మోడీ ఆలోచనలతో పుట్టిన క్రాస్ బ్రీడ్ హైబ్రీడ్ సీఎం”

తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ ‘స్కీములు’ పూర్తిగా అడుగంటిపోయాయని, కేవలం ‘స్కాములు’ మాత్రమే రాజ్యమేలుతున్నాయని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను, తెరవెనుక సాగుతున్న రాజకీయ నాటకాలను ఎండగట్టారు.

కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్..
విద్యుత్ రంగానికి సంబంధించిన ‘కుసుమ్’ (KUSUM) పథకంలో రాష్ట్రంలో ఏకంగా రూ. 1,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఈ కుంభకోణంలో ప్రభుత్వంలోని కొందరు అత్యంత కీలకమైన పెద్దల పేర్లు వినపడుతున్నాయని, దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తక్షణమే స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భట్టి విక్రమార్క శాఖలోనే జరుగుతున్న ఈ రూ.1000 కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఒక జాతీయ బ్యాంకును సైతం బ్లాక్ మెయిల్ చేసి, భయపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ. 30,000 కోట్లు బాకీ పడిందని.. రైతుబంధు కోసం వీరు ఇచ్చిన నిధుల కంటే, సొంత ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ పర్యటనలకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు.

రేవంత్ ఒక ‘హైబ్రిడ్ సీఎం’
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఆలోచనల నుంచి పుట్టిన ఒక ‘క్రాస్ బ్రీడ్ హైబ్రిడ్ సీఎం’ పాలన సాగుతోంది. తెలంగాణ హైబ్రిడ్ సీఎం రేవంత్ రెడ్డి.. మోడీ జట్టు అన్నది ఇప్పుడు పూర్తిగా ఖాయమైపోయింది. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తుంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం పీఏగా మారి ఇతర కేంద్ర మంత్రులతో ఆయనకు అపాయింట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. దీన్ని బట్టే బిఆర్‌ఎస్-బీజేపీ ఒక్కటా, లేక బిఆర్‌ఎస్-హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది ప్రజలకు తేలిపోయింది.”

బిజెపి, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి రాష్ట్రంలో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలను మోసం చేయడానికి తెరవెనుక నాటకాలు ఆడుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. “పవన్ కళ్యాణ్ తెలంగాణలో కాదు.. దేశంలో ఎక్కడైనా పార్టీ ఆఫీసు పెట్టుకోవచ్చు, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. అయితే, తెలంగాణ వచ్చినందుకు 11 రోజులు అన్నం తినలేదని పవన్ కల్యాణ్ చెప్పడం హాస్యాస్పదం. ఆయన గుర్తుంచుకోవాలి.. వాళ్ళ శరీర నిర్మాణం జరిగింది తెలంగాణ తిండితోనే” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment