అంతర్జాతీయ మార్కెట్లో (International Market) నెలకొన్న ముడిచమురు సంక్షోభం (Crude Oil Crisis), ఇంధన కొరత (Fuel Shortage) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పెట్రోల్(Petrol), డీజిల్ (Diesel) సరఫరాపై కీలక ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రిటైల్ పెట్రోల్ బంకుల (Petrol Bunks) నుంచి వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం బల్క్ కొనుగోళ్లు జరపడాన్ని కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఈ మేరకు అత్యవసర నియంత్రణ ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ ఆంక్షలు తక్షణమే అమలులోకి వచ్చి, ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం, రిటైల్ పెట్రోల్ బంకుల్లో ఏ ఒక్క వినియోగదారునికి లేదా వాహనానికి ఒక రోజులో 200 లీటర్ల (200 Litres) కంటే ఎక్కువ డీజిల్ నింపకూడదు. అలాగే, రిటైల్ బంకుల నుంచి కొనుగోలు చేసిన ఇంధనాన్ని బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించడంపై కూడా ప్రభుత్వం పూర్తి నిషేధం విధించింది. కేవలం వాహనాల ఇంధన ట్యాంకులు లేదా అనుమతించబడిన కంటైనర్లలో మాత్రమే నిర్దేశిత పరిమితి లోపు డీజిల్ పోయాలని స్పష్టం చేసింది.
ఇటీవల పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)(Middle East) లో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. అయినప్పటికీ, సామాన్య సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రిటైల్ బంకుల్లో ధరలను నియంత్రణలో ఉంచాయి. కానీ, వాణిజ్యపరమైన బల్క్ ధరలు మాత్రం మార్కెట్ రేట్లకు అనుగుణంగా భారీగా పెరిగిపోయాయి.
ఉదాహరణకు ఢిల్లీలో రిటైల్ బంకుల్లో డీజిల్ ధర: రూ. 95.20 పర్ లీటర్, కమర్షియల్ బల్క్ డీజిల్ ధర: రూ. 134.50 పర్ లీటర్
లీటరుకు దాదాపు 39 రూపాయల భారీ వ్యత్యాసం ఉండటంతో.. భారీ పరిశ్రమలు, రవాణా సంస్థలు, కమర్షియల్ వినియోగదారులు నేరుగా రిటైల్ బంకులను (Retail Bunks) ఆశ్రయించి వేల లీటర్ల డీజిల్‌ను ముందే కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీనివల్ల సాధారణ వాహనదారులకు, ద్విచక్ర వాహన చోదకులకు బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ అక్రమ తరలింపును, కృత్రిమ కొరతను అరికట్టడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై కమర్షియల్ వినియోగదారులు కేవలం తమకు కేటాయించిన ప్రత్యేక బల్క్ సప్లై పాయింట్ల నుంచే ఇంధనాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) అమరావతి (Amaravati) పరిధిలో నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి, అక్కడ పనిచేస్తున్న భారీ నిర్మాణ సంస్థలకు స్థానిక రిటైల్ బంకుల నుంచే నేరుగా బల్క్ డీజిల్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లీటరుకు రూ. 39 లాభం చూసుకుని నిర్మాణ సంస్థలు రిటైల్ బంకుల నుంచి భారీగా డీజిల్ తరలించడంతో.. ఏపీలోని పలు ప్రాంతాల్లో సామాన్య వాహనదారులకు డీజిల్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.








