ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. మొత్తం 4 స్థానాలకు గానూ.. సీట్ల సర్దుబాటు ఫార్ములా ప్రకారం తెలుగుదేశం పార్టీ (TDP) మూడు స్థానాలను, జనసేన పార్టీ (JSP) ఒక స్థానాన్ని పంచుకోవాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సీట్ల వాటాలో బీజేపీకి మొండిచెయ్యి దక్కినట్టుగా తెలుస్తోంది. అయితే, ఈ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న కొన్ని అంతర్గత పరిణామాలు, అభ్యర్థుల పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
కూటమి ఒప్పందంలో భాగంగా జనసేన వాటాకు దక్కిన ఏకైక తొలి రాజ్యసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేత, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కు కేటాయించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు కరకట్ట నివాసం యజమానిగా గుర్తింపులో ఉన్న లింగమనేని రమేష్‌కు జనసేన కోటా నుంచి సీటు ఇస్తుండటంపై సొంత పార్టీలోనే అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తొలి రాజ్యసభ స్థానాన్ని చంద్రబాబు సన్నిహితుడికి కేటాయించడం ఏంటని ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నారు.
టీడీపీ రేసులో లోకేష్ అనుచరులు
ఇక తెలుగుదేశం పార్టీకి కేటాయించిన మూడు స్థానాల్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని టాక్. ప్రధానంగా ముగ్గురి పేర్లు రేసులో బలంగా వినిపిస్తున్నాయి. నారా లోకేష్‌కు అత్యంత ఆప్తుడు, కీలక అనుచరుడిగా ఉన్న కిలారి రాజేష్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్‌కు ఈసారి కూడా రెన్యూవల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు, టీడీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ చింతకాయల విజయ్ పేరు దాదాపు ఖరారు అయినట్టుగా లీకులు వస్తున్నాయి.
వర్ల రామయ్యకు ఈసారైనా దక్కేనా?
తాజా సీట్ల సర్దుబాటు ప్రచారంలో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కకపోవడం కూటమిలో పెద్ద చర్చకు దారితీసింది. 3 టీడీపీ, ఒక సీటు జనసేన పంచుకోగా, పొత్తు ధర్మంలో బీజేపీకి ఒక్కటి కూడా దక్కకపోవడం గమనార్హం. మరోవైపు, పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా గట్టిగా గళం వినిపిస్తున్న టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు ఈసారి కూడా నిరాశే మిగలనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కూటమి అభ్యర్థుల ఎంపికలో ఈసారి కూడా ఆర్థికంగా అత్యంత బలంగా ఉన్న నేతలకే పెద్దపీట వేయడంపై పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో అంతర్గత అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా అధికారిక ప్రకటన వస్తేనే ఈ సమీకరణాలపై పూర్తి స్పష్టత రానుంది.







