అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊర‌ట‌

అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊర‌ట‌

Summarize with AI

ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్యకు (Akkineni Naga Chaitanya) ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) భారీ ఉపశమనం లభించింది. తన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఫొటోలను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో దుర్వినియోగం చేస్తున్నారంటూ, తన ‘పర్సనాలిటీ అండ్ పబ్లిసిటీ రైట్స్’(Personality and Publicity Rights) కాపాడాలని కోరుతూ నాగచైతన్య దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ జ్యోతి సింగ్ (Justice Jyoti Singh) ధర్మాసనం.. నాగచైతన్యకు వ్య‌క్తిగ‌త రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ప్రతివాదులుగా ఉన్న పలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సంబంధిత మధ్యవర్తులకు కోర్టు సమన్లు జారీ చేసింది.

నాగచైతన్య తరఫున కోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ వైభవ్ గగ్గర్(Vaibhav Gaggar).. డిజిటల్ ప్రపంచంలో నటుడి వ్యక్తిత్వ హక్కులకు జరుగుతున్న తీవ్ర భంగంపై ధర్మాసనానికి వివరించారు. కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సర్చ్ ట్యాగ్‌లు, మెటాడేటాలో నాగచైతన్య పేరు, ఫొటోలను అనుమతి లేకుండా వాడుకుంటూ తప్పుడు అసోసియేషన్ క్రియేట్ చేస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్ టెక్నాలజీ, వాయిస్ క్లోనింగ్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి నాగచైతన్య పోలికలతో ఉన్న అనధికారిక ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను, మార్ఫింగ్ చేసిన ఆడియో-విజువల్స్ విచ్చలవిడిగా ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారని వివరించారు. ఆయన అనుమతి లేకుండా ఫొటోలను వాడి కమర్షియల్ వెబ్‌సైట్లలో ఈ-కామర్స్ వస్తువులను అమ్ముతున్నారని తెలిపారు.

ఈ పరిణామాలు నాగచైతన్య వ్యక్తిగత జీవితాన్ని, ఆయన పరువును తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని, ఇది కేవలం విమర్శ కాదని, పూర్తిగా ట్రోలింగ్, వ్యక్తిత్వ హననమని లాయర్ వాదించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ జ్యోతి సింగ్.. “ప్రజా జీవితంలో ఉన్నవారు ఇతరుల కంటే ఎక్కువ విమర్శలకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి” అని స్పష్టం చేస్తూ నటుడి హక్కులకు రక్షణ కల్పించారు.

ఆన్‌లైన్‌లో రోజురోజుకూ కొత్త లింకులు పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో వచ్చే ఇలాంటి అనధికారిక కంటెంట్‌ను కూడా వెంటనే తొలగించేలా ‘డైనమిక్ ఇంజంక్షన్’ ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి కోర్టు వాయిదా వేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment