తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడొక సరికొత్త చర్చ జోరందుకుంది. అదే.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ‘హాట్ లైన్’ రాజకీయ వ్యవహారం. ఒకవైపు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతూనే.. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో చంద్రబాబు తెరవెనుక బంధాన్ని కొనసాగిస్తున్నారనే చర్చ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బయటపడ్డ అవినాభావ బంధం!
తాజాగా హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రీవనం సెంటర్లో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఈ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుతో తనకున్న అవినాభావ సంబంధాన్ని బాహాటంగానే వ్యక్తం చేశాయి.
ఈ సమావేశంలో పాత కాంగ్రెస్ నాయకులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. సభలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ పార్టీ జెండాల కంటే తెలుగుదేశం జెండాలు, టీడీపీ శ్రేణులే భారీగా కనిపించడం తెలుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ సీఎం సభలో టీడీపీ హవా నడవడమేంటనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి.

ఇలాంటి పరిణామాలు ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఖమ్మం వేదికగా జరిగిన మీటింగ్‌లో కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీతో ఉన్న రహస్య బంధాన్ని బయటపెట్టాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేయడమే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పార్టీని, తెలంగాణలోనే లేకుండా చేయాలని, ఆ పార్టీ జెండా దిమ్మెలను కూల్చేసి, ఆ పార్టీని పాతిపెట్టాలని పిలుపునిచ్చారు.
రాజకీయంగా ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం చంద్రబాబు “హాట్ లైన్” రాజకీయామేనన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. తెలంగాణలో పరస్పర వ్యాపార బంధాలు, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ.. వయా రేవంత్ రెడ్డి ద్వారా ఢిల్లీలోని రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్ నెట్వర్క్ నడుపుతున్నారనే విషయం ఈ పరిణామాలతో స్పష్టమవుతోందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీలో విందు రాజకీయాలు!
ఇటీవల మహిళా రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో చర్చకు వచ్చిన సందర్భంలోనూ ఇలాంటి చిత్రమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆ బిల్లును కాంగ్రెస్ తిరస్కరించగా, ఆ రెండ్రోజులు టీడీపీ మహిళా నేతలు రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడం, ఆ తర్వాతి రోజే ఏపీ బీజేపీ నేత ఇంట్లో ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ విందుకు టీడీపీ సీనియర్లతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ కూడా హాజరుకావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలోని జాతీయ మీడియా, రాజకీయ వర్గాలు సైతం ఈ విచిత్ర బంధాన్ని చూసి నోరెళ్లబెట్టాయి.
“తన స్వార్థం కోసం, రాజకీయ రక్షణ కోసం ఢిల్లీలో బీజేపీతో చెలిమి చేస్తున్నప్పటికీ, చంద్రబాబు మనసంతా కాంగ్రెస్ వైపే ఉందనే విషయం ఈ వరుస ఘటనల ద్వారా పదే పదే రుజువవుతోంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆయన గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఇస్తున్నారు” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఢిల్లీలో ఎన్డీఏ నేతల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి
— Telugu Feed (@Telugufeedsite) April 18, 2026
తెలుగు రాష్ట్రాల నేతలకు అల్పాహార విందు ఏర్పాటు చేసిన కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్
కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలతో పాటు విందుకు హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/Seumd47fth
ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై, బీజేపీ నేతలపై చంద్రబాబు కురిపిస్తున్న ప్రశంసలన్నీ కేవలం రాజకీయ అవసరార్థం కోసమేననే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్టే ఇటీవలి రాజ్యసభ స్థానాల భర్తీ చర్చల్లో కూడా దీని ప్రభావం కనిపించింది.
ఏపీ వాటాగా ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లో.. కూటమి ఒప్పందం ప్రకారం టీడీపీకి రెండు, జనసేన, బీజేపీలకు ఒక్కొక్కటి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, అనూహ్యంగా ఇటీవల మిత్రపక్షాలకు రాజ్యసభ సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు తెగేసి చెప్పడం కూటమిలో అలజడి రేపింది. ఇదిలా ఉండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం స్పందిస్తూ.. తనను ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నప్పుడు మిత్రపక్షమైన బీజేపీ వాళ్లు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీయడం గమనార్హం.
గత చరిత్ర కూడా అదే చెప్తోందా?
గతంలో 2017లో కర్ణాటక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌తో చంద్రబాబు తెరవెనుక చేతులు కలపడం, ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో నేరుగా భేటీ అయిన సందర్భాలను రాజకీయ వర్గాలు ఇప్పుడు మళ్లీ గుర్తుచేసుకుంటున్నాయి. అవకాశవాద రాజకీయాలు చేస్తూ, కేంద్రంలో అధికారం ఎటు ఉంటే అటు మారుతూ.. లోపాయికారీగా మాత్రం కాంగ్రెస్‌తో హాట్ లైన్ బంధాన్ని కొనసాగిస్తున్నారనే విమర్శలు ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.









‘పవన్ ఓ ప్యాకేజీ స్టార్’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు