3 నెలల్లోపు వెల్లడించాల్సిందే.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

3 నెలల్లోపు వెల్లడించాల్సిందే.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Summarize with AI

దేశంలో న్యాయపరమైన ప్రక్రియల్లో జాప్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విచారణ ముగిసి, తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటిని వెల్లడించడంలో జరుగుతున్న ఆలస్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇకపై ఏ కేసైనా విచారణ పూర్తయ్యాక, గరిష్ఠంగా మూడు నెలల (90 రోజులు) లోపే రిజర్వ్ చేసిన తీర్పులను వెల్లడించాలని దేశంలోని అన్ని హైకోర్టులకు (High Courts) సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

“ఆలస్యమైన న్యాయం.. న్యాయం నిరాకరించడమే” అనే సూత్రాన్ని గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తీర్పుల ప్రకటనలో ఆలస్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు కఠినమైన నియమాలను విధించింది.

ఒకవేళ ఏదైనా కేసులో తీర్పు (Judgment) రిజర్వ్ చేసి 3 నెలలు దాటినా వెల్లడించకపోతే, సంబంధిత విషయాన్ని ఆయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లేందుకు అర్హ‌త క‌లిగిన వారికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. హైకోర్టు (High Court) ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) నోటీసు ఇచ్చినప్పటికీ ఇంకా ఆలస్యమైతే.. సదరు కేసును ఆ బెంచ్ నుంచి ఉపసంహరించి, మరో కొత్త బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రతి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, తమ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న రిజర్వ్డ్ జడ్జ్‌మెంట్స్‌ జాబితాను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఆ వివరాలను సంబంధిత హైకోర్టు సీజేకు సమర్పించాలని ఆదేశించింది.

ప్రజల్లో నమ్మకం దెబ్బతినకూడదు
తీర్పులు ఆలస్యం కావడం వల్ల సాధారణ ప్రజల్లో న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం మరియు విశ్వసనీయత దెబ్బతింటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛ, బెయిల్ వంటి అత్యవసర విషయాల్లో మరింత వేగంగా నిర్ణయాలు రావాలని కోర్టు పేర్కొంది.

హైకోర్టుల పనితీరును మరింత పారదర్శకంగా మార్చేందుకు, ప్రతి హైకోర్టు వెబ్‌సైట్‌లో ఏ న్యాయమూర్తి ఏ కేసును ఎప్పుడు రిజర్వ్ చేశారు, తీర్పు ఇవ్వడానికి ఎంత సమయం పట్టిందనే వివరాలను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment