హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరం రూ. 237 కోట్లు!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్.. ఎకరం రూ. 237 కోట్లు!

Summarize with AI

భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ (Real Estate Market) మరోసారి తన సత్తా చాటింది. ఐటీ హబ్ (IT Hub) నడిబొడ్డున ఉన్న రాయదుర్గం భూములు (Raidurgam Lands) ఆకాశాన్నంటే ధర పలికి పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాయి. హైదరాబాద్‌పై (Hyderabad) ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ, గతంలో ఉన్న గరిష్ఠ ధర రికార్డును బ్రేక్ చేస్తూ రాయదుర్గంలో ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్లు ప‌లికింది.

తెలంగాణ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ ఈ-వేలంలో ఈ రికార్డ్ స్థాయి ధర నమోదైంది. రాయదుర్గంలోని పన్మక్త నాలెడ్జ్ సిటీ, సర్వే నెంబర్ 83/1లో ఉన్న 6.29 ఎకరాల విస్తీర్ణంలోని 1A, 1F ప్లాట్లకు అధికారులు ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలంలో నిర్ణయించిన కనీస ధర ఎకరాకు రూ. 139 కోట్లు కాగా, అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తే ఎక‌రం ధ‌ర ఏకంగా రూ. 237 కోట్లు ప‌లికింది.

ఈ భారీ వేలం ద్వారా 6.29 ఎకరాలకు గానూ టీజీఐఐసీకి (TGIIC) ఏకంగా రూ. 1,490.73 కోట్ల ఆదాయం సమకూరనుంది. హైదరాబాద్‌కే చెందిన ‘గౌర వెంచర్స్'(Goura Ventures) అనే ప్రైవేట్ డెవలప్‌మెంట్ సంస్థ ఈ రికార్డు మొత్తానికి భూమిని దక్కించుకుంది. ఈ స్థలాన్ని మల్టీ-యూజ్ పర్పస్‌లో స్కైరైజ్ బిల్డింగులతో (Skyrise Buildings) అభివృద్ధి చేయనున్నారు.

ఈ ల్యాండ్ పార్సిల్ నగరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీ-హబ్ (T-Hub), టీ-వర్క్స్ (T-Works), క్వాల్‌కమ్ క్యాంపస్‌లకు అత్యంత సమీపంలో ఉండటమే ఇంతటి పోటీకి, భారీ ధరకు ప్రధాన కారణమని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ఇదే ఏరియాలో జరిగిన వేలంలో 11 ఎకరాల భూమికి ఎకరాకు గరిష్ఠంగా రూ. 177 కోట్లు పలికింది. ఇప్పటివరకు అదే హైదరాబాద్ సిటీలో ఆల్‌టైమ్ రికార్డుగా ఉండేది. తాజా వేలంతో ఆ పాత రికార్డు కనుమరుగైపోయింది.

రావిర్యాలలో గజం రూ. 83,500
మరోవైపు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం, ‘ఫ్యూచర్ సిటీ'(Future City) ఎంట్రన్స్‌లో ఉన్న రావిర్యాల హౌసింగ్ బోర్డు భూములకు కూడా గురువారం నిర్వహించిన ఈ-వేలంలో భారీ రేట్లు పలికాయి. మొత్తం 4 ప్లాట్లకు (1,000 నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణం) వేలం జరగ్గా.. రూ. 140 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 17 సంస్థలు ఈ వేలంలో పోటీ పడ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణమున్న ఒక ప్లాట్ రికార్డు స్థాయిలో చదరపు గజం రూ. 83,500 చొప్పున అమ్ముడుపోయింది. మరో 6 వేల చదరపు గజాల ప్లాట్ గజానికి రూ. 62,500 చొప్పున విక్రయించారు.

నేడు మరో 4 ల్యాండ్ పార్శిల్స్ వేలం
ఈ వేలం ప్రక్రియ కొనసాగింపుగా.. శుక్రవారం నాడు కూకట్‌పల్లి (KPHB) కాలనీ ఫేజ్ 1-2 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల ప్లాట్లు, అలాగే కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతంలోని 10,890 చదరపు గజాలు, 3,388 చదరపు గజాల విస్తీర్ణం గల మరో నాలుగు ల్యాండ్ పార్శిళ్లకు ఈ-యాక్షన్ నిర్వహించనున్నారు. దీనిపై కూడా రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment