కేరళ(Kerala) రాజకీయాలు ఒక్కసారిగా మంటలు రేపుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న పినరయి విజయన్ (Pinarayi Vijayan) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నిర్వహించిన సోదాలు (Raids) రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కన్నూర్‌లోని విజయన్ ఇంట్లో గంటలపాటు జరిగిన తనిఖీల అనంతరం బయటకు వస్తున్న ఈడీ అధికారులను సీపీఐ(ఎం)(CPI(M)) కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొందరు అధికారుల వాహనాలపై రాళ్లు విసిరిన ఘటన మరింత కలకలం రేపింది. పరిస్థితి అదుపుతప్పకుండా సీపీఐ(ఎం) సీనియర్ నేతలు రంగంలోకి దిగి కార్యకర్తలను శాంతింపజేయడంతో అధికారులు అక్కడి నుంచి బయటపడ్డారు.
ఈ ఘటనపై సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి (M.A. Baby) తీవ్రస్థాయిలో స్పందించారు. ఈడీ దాడులు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమని, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికే కేంద్ర సంస్థలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు కేరళలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. “ఈడీ ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ కాదు.. అది పూర్తిగా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ (BJP-RSS) రాజకీయ ఆయుధంగా మారిపోయింది” అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరో పెద్ద చర్చకు దారితీశాయి.








