హైదరాబాద్‌లోని (Hyderabad) కూకట్పల్లి (Kukatpally) నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం (BRS Meeting) రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యేలు వివేక్ గౌడ్(Vivek Goud), నవీన్ రావు(Naveen Rao), శంభీపూర్ రాజు (Shambhipur Raju) తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Government) పనితీరుపై విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్ భవిష్యత్‌పై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని కేటీఆర్(KTR) పేర్కొన్నారు. జీఓ 58, 59 ద్వారా పేదలకు ఇళ్ల పట్టాలు (House Pattas) ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఇందిరమ్మ రాజ్యం”(Indiramma Rajyam), “ప్రజా పాలన”(Praja Palana) పేరుతో హైడ్రా (HYDRAA) ద్వారా పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు. పెన్షన్లు, ఇళ్లు, సంక్షేమ హామీల విషయంలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. “ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకుని తిరిగితే ఆయన జేబుదొంగ కాదు.. గజదొంగ” అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన కేటీఆర్.. 2028 ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణ రంగాలు కుదేలయ్యాయని ఆరోపిస్తూ, జూన్ నుంచి భారీ స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.








