ఏపీలో ఘోరం.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని కుల బహిష్కరణ

ఏపీలో ఘోరం.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని కుల బహిష్కరణ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మ‌రోసారి కుల వివ‌క్ష వివాదం సంచ‌ల‌నం సృష్టిస్తోంది. మొన్న పిఠాపురంలోని (Pithapuram) ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ద‌ళిత విద్యార్థుల‌పై (Dalit Students) జ‌రిగిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే.. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో (NTR District) మ‌రో దారుణ సంఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో కుల వివక్ష వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. గ్రామానికి చెందిన మొద్దుతేజ సత్యనారాయణ (Modduteja Satyanarayana), నాగలక్ష్మి (Nagalakshmi) అనే యువతీయువకులు 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం ఇష్టం లేని గ్రామ కుల పెద్దలు అప్పటి నుంచి వారిపై కక్షగట్టారు.

బారసాల వేడుకలో ఘోర అవమానం
ఇటీవలే నాగలక్ష్మి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలోనే తమ పుట్టిన బాబుకు బారసాల (నామకరణ మహోత్సవం) వేడుకను నిర్వహించాలని ఆ కుటుంబం భావించింది. అయితే ఈ వేడుకను ఆనందంగా జరుపుకోవాల్సిన ఆ కుటుంబానికి కుల పెద్దల రూపంలో ఊహించని అవమానం ఎదురైంది.

వేడుక జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన కుల పెద్దలు, నాగలక్ష్మి కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించి అవమానాలకు గురిచేశారు. అంతటితో ఆగకుండా తేజ(Teja), నాగలక్ష్మి జంటతో పాటు, ఆ అమ్మాయి కుటుంబాన్ని కూడా గ్రామం నుంచి వెలివేస్తున్నట్లు (గ్రామ బహిష్కరణ) తీర్పు చెప్పారు.

రూ. 2 లక్షలు ఇస్తేనే ఊర్లోకి!
గ్రామ పెద్దల అనాగరిక తీర్పుతో శ్రీరాంపురం గ్రామంలో ఆ కుటుంబానికి తీవ్ర కష్టాలు మొదలయ్యాయి. బాధితులకు గ్రామ ప్రజలు ఎవరూ ఎలాంటి సహాయ నిరాకరణ చేయకూడదని, వారితో మాట్లాడకూడదని పెద్దలు హుకుం జారీ చేశారు. వారి ఇళ్లకు ఎవరూ వెళ్లకూడదని, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులు ఎవరి ఇంటికైనా వస్తే రానివ్వకూడదని ఆదేశించారు. ఎవరైనా ఈ ఆదేశాలను ధిక్కరించి ఆ కుటుంబానికి అండగా నిలిస్తే.. వారికి భారీగా జరిమానాలు విధిస్తామని గ్రామస్థులను హెచ్చరించారు.

అంతేకాకుండా, గ్రామ పెద్దల తీర్పును కాదని, ఆ ప్రేమ జంటను గ్రామంలోకి రప్పించి, ఆహ్వానించినందుకు గానూ రూ. 2 లక్షల రూపాయలు జరిమానా కట్టాలని నాగలక్ష్మి కుటుంబానికి అల్టిమేటం జారీ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేక, ఊరి జనమంతా దూరం పెట్టడంతో ఆ కుటుంబం తీవ్ర మానసిక క్షోభకు గురవుతోంది.

గ్రామ పెద్దల వేధింపులు తాళలేక, తమకు ప్రాణభయం ఉందంటూ బాధితురాలు నాగలక్ష్మి చివరకు పోలీసులను ఆశ్రయించింది. తమను కులం పేరుతో వెలివేసి, సామాజికంగా ఒంటరిని చేసిన గ్రామ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఈ ఆధునిక కాలంలో కూడా ఇంకా ఇలాంటి అనాగరిక వెలివేతలు, కుల వివక్షలు కొనసాగుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment