టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. పాటంశెట్టి ఇంటిపై దాడి (Video)

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం.. పాటంశెట్టి ఇంటిపై దాడి (Video)

Summarize with AI

కాకినాడ జిల్లా (Kakinada District) జగ్గంపేట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జగ్గంపేట స్వతంత్ర (ఇండిపెండెంట్) అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర (Patamsetti Suryachandra) ఇంటిపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) జ్యోతుల నెహ్రూ (Jyothula Nehru) అనుచరులు దాడికి తెగబడటం తీవ్ర కలకలం రేపింది. బూరుగుపూడిలోని సూర్యచంద్ర నివాసం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ప్రెస్ మీట్ పెట్టడమే కారణమా?
రాష్ట్ర మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పర్యటనను పురస్కరించుకుని, జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ, అవినీతి అక్రమాలను నిలదీస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర ఒక ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్‌ల (Jyothula Naveen) అవినీతిని బట్టబయలు చేస్తానని ఆయన ప్రకటించారు.

అయితే ఈ సమాచారం అందుకున్న టీడీపీ నేతలు, జ్యోతుల నెహ్రూ అనుచరులు భారీ సంఖ్యలో బూరుగుపూడిలోని (Burugupudi) పాటంశెట్టి సూర్యచంద్ర నివాసానికి చేరుకున్నారు. “ఈ ప్రెస్ మీట్ లో మేము కూడా కూర్చుంటాం” అంటూ సూర్యచంద్ర ఇంటి వద్ద రచ్చకు దిగారు. ఈ క్రమంలోనే పాటంశెట్టి అనుచరులపై టీడీపీ శ్రేణులు భౌతిక దాడికి దిగారు.

ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా?.. – పాటంశెట్టి ఫైర్‌
ఈ దాడి ఘటన అనంతరం పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ అండతో చేస్తున్న అరాచకాలను ఆయన తీవ్రంగా ఖండించారు. “మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా జగ్గంపేటలో సాగుతున్న భారీ దోపిడీ, అవినీతిపై ప్రెస్ మీట్ పెట్టి నిజాలు చెప్పాలనుకున్నాను. కానీ బూరుగుపూడిలోని నా ఇంటికి వచ్చి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అనుచరులు మాపై విచక్షణారహితంగా దాడి చేశారు.”

“గత ఎన్నికల సమయంలో జగ్గంపేట పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడు స్వయంగా.. ‘అవినీతి ఎక్కడ జరిగినా ప్రశ్నించండి’ అని చెప్పారు. మరి ఇప్పుడు అదే అవినీతిపై నేను గళం విప్పితే నా గొంతు నొక్కేయాలని చూస్తారా?, నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, దళిత నాయకులను ముందు పెట్టి మాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించాలని ఎమ్మెల్యే జ్యోతుల కుట్రలు పన్నుతున్నారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. నన్ను అణిచివేసి, జైలుకు పంపించాలనుకుంటే నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అవినీతిపై నా పోరాటం ఆగేది లేదు” అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment