ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త సేవలను అందించడంలో ఈపీఎఫ్‌వో (Employees’ Provident Fund Organization) ముందడుగు వేస్తోంది. రాబోయే మార్పులు పీఎఫ్ ఖాతాదారుల జీవనశైలిని మరింత సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు, ఏటీఎం ద్వారా నిధుల ఉపసంహరణ, ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ వంటి ముఖ్యమైన అప్డేట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు
ప్రస్తుతం ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తుండగా, ఇది రూ. 15,000 పరిమితితో ఉంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, వారు తమ అసలు వేతనానికి అనుగుణంగా కంట్రిబ్యూషన్ చేసుకోవచ్చు. దీని ద్వారా పదవీ విరమణ నిధి, పెన్షన్ చెల్లింపులు భారీగా పెరుగుతాయి.
ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు ఉపసంహరణ
పీఎఫ్ డబ్బును ఏటీఎం కార్డ్‌తో నేరుగా ఉపసంహరించుకునే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి రానుంది. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి అమల్లోకి రానుంది. ఈ మార్పుతో సభ్యుల విలువైన సమయం ఆదా అవుతుంది.
ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్
వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్, మెరుగైన పారదర్శకత కోసం ఐటీ వ్యవస్థను 2025 జూన్ నాటికి పూర్తిగా అప్‌గ్రేడ్ చేయనుంది.
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్
ఈపీఎఫ్‌వో సభ్యులకు వారి పెట్టుబడులలో అధిక రాబడిని అందించడానికి ఈక్విటీలలో పెట్టుబడిని అనుమతించే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ ఉపసంహరణ
పింఛనుదారులు దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచైనా తమ పెన్షన్‌ను ఉపసంహరించుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. అదనపు ధ్రువీకరణ అవసరం ఉండదు.








