పుదుచ్చేరి రాజకీయాల్లో (Puducherry Politics) మరోసారి ఎన్‌ఆర్ కాంగ్రెస్ (NR Congress) అధినేత ఎన్. రంగస్వామి (N. Rangasamy) తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఎన్‌డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించడంతో బుధవారం ఆయన ఐదోసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా (Chief Minister) ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో జరిగిన ఈ వేడుకలో లెఫ్టినెంట్ గవర్నర్ (Lieutenant Governor) కైలాశనాథన్ (Kailashnathan) ఆయనతో పదవి, గోప్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ(BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్ నాబిన్‌తో (Nitin Nabin) పాటు పలువురు ప్రముఖులు, కూటమి నేతలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన రంగస్వామి.. పుదుచ్చేరిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు.
మౌలిక వసతులు(Infrastructure), పర్యాటకం(Tourism), ఉపాధి(Employment), సంక్షేమ రంగాలపై (Welfare Sectors) ప్రత్యేక దృష్టి సారిస్తామని సీఎం రంగస్వామి వెల్లడించారు. ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో నమస్సివాయం (Namassivayam) కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి.. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, కొత్త పథకాలను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. త్వరలో మల్లాది కృష్ణరావు కూడా మంత్రివర్గంలో చేరనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పుదుచ్చేరిలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని, ముఖ్యంగా పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని నేతలు పేర్కొన్నారు.
మే 4న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్‌ఆర్ కాంగ్రెస్ (NR Congress) 12 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ(BJP) 4, అన్నాడీఎంకే (AIADMK) 1 స్థానంలో విజయం సాధించాయి. మరోవైపు డీఎంకే 5 స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానం మాత్రమే దక్కించుకున్నాయి. తమిళనాడులో సంచలనంగా ఎదిగిన తమిళగ వెట్టిరి కజగం (TVK) పుదుచ్చేరిలో కూడా రెండు స్థానాలు గెలిచి తన ప్రభావాన్ని చూపించింది. తాజా ఫలితాలతో పుదుచ్చేరి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








