తెలంగాణ (Telangana) మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ టి. హరీష్ రావు (T. Harish Rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాలన కేవలం “కూల్చుడు”కే పరిమితమైందని, అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి బడులను(Schools), గుడులను (Temples) కూల్చడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. గుప్తనిధుల కోసమే పురాతన ఆలయాలను కూల్చారని ఆయన ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 76 స్కూళ్ల నిర్మాణం పేరుతో 500 కోట్ల రూపాయలను లూటీ చేశారని, 4.96 శాతం ఎక్సెస్ నిధులతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రోడ్ల టెండర్లలో జరుగుతున్న అక్రమాలను తానే బయటపెట్టానని, దమ్ముంటే ఆ టెండర్లను రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. హైడ్రా(HYDRA) పేరుతో పేదల ఇళ్లను కూల్చి వారిని రోడ్డున పడేశారని మండిపడ్డారు.
బండి సంజయ్ కొడుకు కేసుపై ‘సిట్’ డ్రామా
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై (Bhagirath) నమోదైన పోక్సో కేసు (POCSO Case) విషయంలో రేవంత్ రెడ్డి తీరును హరీష్ రావు తప్పుబట్టారు. “ఈ కేసులో ‘సిట్’ (SIT) వేయడమంటే కేసును నీరుగార్చడమే. రేప్ కేసు పెట్టి నాలుగు రోజులైనా ఇప్పటివరకు అరెస్టు ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించారు. సామాన్యులు రీట్వీట్ చేస్తేనే అర్థరాత్రి ఎత్తుకెళ్లే పోలీసులు, ఇంత పెద్ద నేరం జరిగినా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు 10 సిట్ లు వేశారని, కానీ ఏ ఒక్కటీ నివేదిక ఇవ్వలేదని, కేవలం లీకులు ఇవ్వడానికే సిట్ లు వాడుకుంటున్నారని విమర్శించారు.
కేసీఆర్ అద్భుతమైన గుళ్లను నిర్మిస్తుంటే.. రేవంత్ రెడ్డి మాత్రం వాటిని కూల్చుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి మీద ఒట్లు పెట్టి మాట తప్పిన రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో రేవంత్ రెడ్డి “లీక్ మాస్టర్” అని హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.








