AIADMK-DMK దోస్తీ? మంత్రి పదవుల వేటలో ఎమ్మెల్యేలు!

AIADMK-DMK దోస్తీ? మంత్రి పదవుల వేటలో ఎమ్మెల్యేలు!

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోతోంది. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని అన్నాడీఎంకే సరికొత్త వ్యూహాలకు తెరలేపింది.

గవర్నర్ నిర్ణయం.. టీవీకేకు బ్రేక్!
తన‌కు మెజారిటీ చూప‌నందున టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేమని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ స్పష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లోనే త‌మ మెజార్టీని నిరూపించుకుంటామ‌ని విజ‌య్ పార్టీ హామీ ఇస్తున్నా.. గ‌వ‌ర్న‌ర్ స‌సేమీరా అంటున్నారు. ఏ పార్టీ అయితే త‌న‌కు ప‌త్రాల రూపంలో మెజారిటీ చూపుతుందో వారికే అవకాశం ఇస్తామని ఆయన ప్రకటించడంతో సమీకరణాలు వేగంగా మారిపోయాయి.

శత్రువులే మిత్రులుగా..
విజయ్ ముఖ్యమంత్రి కావడాన్ని అటు ఎడప్పాడి పళనిస్వామి (EPS), ఇటు ఉదయనిధి స్టాలిన్ ఇద్దరూ ఇష్టపడటం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, టీవీకేను అధికారానికి దూరం చేసేందుకు డీఎంకే మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయి. డీఎంకే కూటమికి 68 స్థానాలు (డీఎంకే 59+ఇతరులు), అన్నాడీఎంకేకు 47 స్థానాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే మెజారిటీ మార్కును సులభంగా దాటే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు పార్టీల ముఖ్య నేతలు ఈ పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

మంత్రి పదవుల కోసం ఆశావహుల క్యూ
అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ఆశతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడే మంత్రి పదవుల కలల్లో మునిగిపోతున్నారు. ఇప్పటికే మంత్రివర్గ జాబితాపై కసరత్తు మొదలైనట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అన్నాడీఎంకే నాయకత్వం వారిని పుదుచ్చేరిలోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌కు తరలించింది. అక్కడ వారికి ఏసీ గదులు, స్విమ్మింగ్ పూల్స్, ఖరీదైన విందులతో రాజభోగాలు కల్పిస్తున్నారు. పాత ‘కూవత్తూరు’ రిసార్ట్ రోజులను గుర్తు చేస్తూ ఎమ్మెల్యేలు అక్కడ సందడి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment