కాంగ్రెస్ ‘వెన్నుపోటు’.. డీఎంకే ఫైర్!

కాంగ్రెస్ ‘వెన్నుపోటు’.. డీఎంకే ఫైర్!

తమిళనాడు రాజకీయ ముఖచిత్రం రోజుకో కొత్త మ‌లుపు తిరుగుతోంది. అనూహ్య పరిణామాల మధ్య మిత్రపక్షాలైన డీఎంకే, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం నటుడు విజయ్ స్థాపించిన టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ మద్దతు పలకడంపై డీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టుకుందని, ఇది తమిళ ప్రజలను మోసం చేయడమేనని డీఎంకే ధ్వజమెత్తింది.

కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం: DMK
కాంగ్రెస్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ తాము అండగా నిలిచామని, ఆ స్నేహం కోసం భారీ మూల్యాన్ని కూడా చెల్లించామని డీఎంకే గుర్తు చేసింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్‌లతో తమకు ఉన్నది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదని, రాహుల్ గాంధీని ఒక సోదరుడిగా గౌరవించామని పేర్కొంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించడం లేదని, ఆ పార్టీకి నమ్మకద్రోహం చేయడం అలవాటేనని విమర్శించింది.

స్టాలిన్ భుజం కాస్తే.. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది
“రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి కాంగ్రెస్ హైకమాండ్ వెనుకాడుతున్న సమయంలో.. మొట్టమొదటిగా ఎం.కె. స్టాలిన్ ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ‘ఇండి’ కూటమిలో కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీల బలాన్ని ఇచ్చింది మేమే. పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ కోసం భుజం భుజం కలిపి పోరాడాం. కానీ, మా కూటమిలో ఉండి ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మద్దతు ఇస్తోంది” అని డీఎంకే నేతలు మండిపడ్డారు.

బీజేపీకి, కాంగ్రెస్‌కు తేడా లేదు..
రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఈ విషయంలో బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని డీఎంకే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓటమి తమకు కొత్త కాదని, గతంలోనూ వెన్నుపోట్లు చూశామని పేర్కొంటూ.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా దీనికి గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించింది.

తమిళనాడులో మారుతున్న ఈ సమీకరణాలు జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ‘ఇండి’ కూటమి భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment