ఎంపీ కేశినేనిపై ఎమ్మెల్యే కొలికపూడి పైచేయి

ఎంపీ కేశినేనిపై ఎమ్మెల్యే కొలికపూడి పైచేయి

కృష్ణా జిల్లా తిరువూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మెప్మా (MEPMA) ఎన్నికల నేపథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల నడుమ జరిగిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడంతో, ఆయన ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరువూరు మెప్మా ఎన్నికల్లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మద్దతు ఇచ్చిన జనసేన కార్యకర్త డెక్కా నవ్య విజయం సాధించారు. మొత్తం 23 మంది సభ్యులు ఆమెకు మద్దతుగా ఓటు వేయడంతో ఆమె మెప్మా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. పోలీసుల భారీ బందోబస్తు, ఇరు వర్గాల వాగ్వాదాల మధ్య ఈ ఎన్నిక ముగిసింది. ఈ విజయం ఎంపీ కేశినేని చిన్ని వర్గానికి పెద్ద షాక్ ఇచ్చిందని తిరువూరు రాజకీయల్లో చర్చ నడుస్తోంది.

ఎంపీ కేశినేని చిన్నికి కొలికపూడి సూటి ప్రశ్నలు
విజయం అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మీడియా ముందు ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “మెప్మా ఎన్నికలు సజావుగా సాగుతుంటే ఎంపీ కేశినేని చిన్నికి అభ్యంతరమేంటి? ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను అడ్డుకోవాలని చూడటం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. మెజార్టీ సభ్యులను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎంపీ వర్గానికి ఎందుకు వచ్చిందని, బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఇటువంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

కొంతమంది అధికారులను ఆఫీసులకు పిలిపించి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని, అధికారులంతా చట్టప్రకారం పని చేయాలని తాను కోరుతున్నానని చెప్పారు. “మెప్మా అధికారులు ఉద్యోగం చేస్తున్నారా లేక రాజకీయం చేస్తున్నారా?” అని నిలదీశారు. “నేను ఫలానా తప్పు చేశానని నిరూపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయగలరా? అలా చేస్తే ఆ ఫ్లెక్సీకి అయ్యే డబ్బులు కూడా నేనే ఇస్తాను” అంటూ సవాల్ విసిరారు.

వ్యక్తిగత అజెండా లేదు.. బాబు ఆశయమే ముఖ్యం
తిరువూరులో ప్రశాంతమైన వాతావరణాన్ని బయటి వ్యక్తులు వచ్చి చెడగొడితే సహించే ప్రసక్తే లేదని ఎంపీ కేశినేని చిన్నీని ప‌రోక్షంగా కొలికపూడి హెచ్చరించారు. తనకంటూ ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల సాధన కోసమే తాను పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. ఎంపీ చిన్ని చేస్తున్న ‘రాచకాలను’ తాను నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటానని, దమ్ముంటే సమాధానం చెప్పాలని దమ్కీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment