పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) (Delimitation) అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు (Ramchander Rao) మండిపడ్డారు. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగే ప్రక్రియ అని, దీనిపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.
సీట్ల పెంపు.. జనాభా ప్రాతిపదికన తప్పనిసరి
దేశంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎంపీ సీట్లు (MP Seats) పెరగాల్సిన అవసరం ఉందని రాంచందర్ రావు స్పష్టం చేశారు. గతంలో 70 కోట్ల జనాభా ఉన్నప్పుడు 540 ఎంపీ సీట్లు ఉండేవని, ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లకు చేరిన నేపథ్యంలో సీట్ల సంఖ్య పెరగడం సహజమని ఆయన గుర్తు చేశారు. 2011 జనాభా లెక్కల ఆధారంగానే సీట్లు పెరుగుతాయని, ఇది నిబంధనల ప్రకారమే జరుగుతుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి ‘హైబ్రిడ్ సిస్టమ్’పై ఎద్దేవా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్ సిస్టమ్’కు (Hybrid System) ప్రపంచంలో ఎక్కడా గుర్తింపు లేదని రామ్ చందర్ రావు ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు సీట్లు పెరగవని, రాజ్యాంగంలోని సెక్షన్ 81 ప్రకారం డీలిమిటేషన్ కమిటీ సూచనల మేరకే సీట్ల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రాంతాల వారీగా విభజన తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని, దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని చెప్పడం కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు.
మహిళా బిల్లును అడ్డుకునే కుట్ర
మహిళా రిజర్వేషన్ బిల్లును (Women’s Reservation Bill) వ్యతిరేకించేందుకే కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని రామ్ చందర్ రావు ఆరోపించారు. గతంలో మతాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ది అని విమర్శించిన ఆయన, మహిళా బిల్లుపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. “హైదరాబాద్‌ను (Hyderabad) మూడు ముక్కలు చేసినప్పుడు సీఎం ఎవరిని అడిగారు?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.








