భారత క్రికెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తున్న యువ ప్రతిభ వైభవ్ సూర్యవంశీకి బంపర్ అవకాశం దక్కనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్‌ను సీనియర్ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించేందుకు యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని భావిస్తున్న బీసీసీఐ, జింబాబ్వే టూర్‌కూ అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే, అత్యంత పిన్న వయసులో భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేసినట్లు అవుతుంది.
ఇక ఐపీఎల్‌లో వైభవ్ ప్రదర్శనలు నిజంగా అద్భుతమే అని చెప్పాలి. ఆర్‌సీబీపై 26 బంతుల్లో 78 పరుగులు, సీఎస్‌కేపై 17 బంతుల్లో 52, ముంబై ఇండియన్స్‌పై 14 బంతుల్లో 39 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. అతని ఆగ్రెసివ్ బ్యాటింగ్‌కు మాజీ దిగ్గజాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ అతన్ని భవిష్యత్ స్టార్‌గా అభివర్ణించగా, ఇర్ఫాన్ పఠాన్, అనిల్ కుంబ్లే వంటి మాజీ ఆటగాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. ఇదే ఫామ్ కొనసాగితే, వైభవ్ త్వరలోనే భారత క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








