ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజధాని అమరావతి (Capital Amaravati) విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉండవల్లిలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee) నివేదికపై వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడటం సంచలనంగా మారింది. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) నియమించిన కమిటీ నివేదికను చంద్రబాబు తనకూనుకూలంగా వక్రీకరిస్తున్నారని ప్రతిపక్ష వైసీపీ (YSRCP) ఆధారాలతో సహా బయటపెట్టింది.
చంద్రబాబు వాదన ఏంటి?
మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. “శివరామకృష్ణయ్య గారి కమిటీ రాష్ట్రమంతా తిరిగింది. విజయవాడ-గుంటూరు (Vijayawada-Guntur) మధ్య రాజధాని ఉండాలని 46 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారని కమిటీకి సమాచారం అందింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే గ్రీన్ ఫీల్డ్ రాజధానిని (Greenfield Capital) విజయవాడ-గుంటూరు మధ్య డిక్లేర్ చేశాం” అని పేర్కొన్నారు.
వైసీపీ బయటపెట్టిన వాస్తవాలు (శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ప్రకారం)
చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ, అసలు కమిటీ నివేదికలో ఏముందో అంశాల వారీగా వివరించింది.

హైదరాబాద్ తప్పు పునరావృతం వద్దు: ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే కేంద్రీకృతం కావడం వల్ల విభజన సమయంలో తలెత్తిన సమస్యలను కమిటీ గుర్తు చేసింది. రాజధాని విషయంలో హైదరాబాద్లో చేసిన తప్పును ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చేయవద్దని స్పష్టంగా హెచ్చరించింది.

అభివృద్ధి వికేంద్రీకరణే ముఖ్యం: అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉండే ‘సూపర్ క్యాపిటల్’ మోడల్ వద్దే వద్దని కమిటీ తేల్చి చెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.రాజధాని అనేది ఖచ్చితంగా రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని కమిటీ స్పష్టం చేసింది.

విజయవాడ-గుంటూరు మధ్య వద్దు: అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. విజయవాడ-గుంటూరు మధ్య రాజధానిని కేంద్రీకరిస్తే అది ఆర్థికంగా, పర్యావరణ పరంగా భారీ నష్టాన్ని కలిగిస్తుందని కమిటీ తన నివేదికలో కుండబద్దలు కొట్టింది. కమిటీ 11 జిల్లాల్లో పర్యటించి దాదాపు 4,728 మంది నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి ఈ నివేదికను రూపొందించింది.

కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. విజయవాడ-గుంటూరు మధ్య భారీ రాజధాని నిర్మాణానికి ఆ కమిటీ సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. అయితే, చంద్రబాబు మాత్రం కమిటీ సానుకూలంగా ఉందంటూ మీడియా ముందే అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది. రాజధాని పేరుతో తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఇలాంటి వక్రభాష్యాలు చెబుతున్నారనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.








