ఆయన ఒకప్పుడు అనర్గళమైన ప్రసంగాలకు మారుపేరు. అష్టావధానిగా (Ashtavadhani), పద్మశ్రీ గ్రహీతగా కోట్లాది మంది తెలుగువారి గౌరవాన్ని అందుకున్నారు. కానీ, ఇటీవల ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikapati Narasimha Rao) తీరు చూస్తుంటే.. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అన్న సామెత ఆయనకే ఎదురుతిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆధ్యాత్మికతను బోధించాల్సిన వ్యక్తి, రాజకీయ రంగు పులుముకొని పేదలపై, విద్యార్థులపై (Students) జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. గరికపాటి అంటే గౌరవం ఉన్నప్పటికీ, హద్దు మీరి చేస్తున్న వ్యాఖ్యలపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పేద విద్యార్థులపై ‘విషం’..
తాజాగా విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై (Midday Meal Scheme) గరికపాటి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. “గుడ్డు (Egg) కోసం స్కూల్‌కు వస్తావా?, భోజనం (Food) పెడితే చదువు రాదు” అంటూ గరికపాటి పేద విద్యార్థులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. స్కూళ్లకు వెళ్లే పేద విద్యార్థులను ‘కొత్త పెళ్లికొడుకులతో’ (New Grooms) పోల్చడం ఆయన అజ్ఞానానికి పరాకాష్ట అని మేధావులు మండిపడుతున్నారు. ఆకలితో ఉన్న కడుపుకు అన్నం పెడితేనే అక్షరం ఒంటబడుతుందన్న కనీస స్పృహ గరికపాటికి లేకపోవడం శోచనీయం. పేదరికం వల్ల పిల్లలు కూలి పనులకు వెళ్లకుండా, బడిబాట పట్టాలనే ప్రభుత్వాల సదుద్దేశాన్ని ఆయన అవహేళన చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘తెలుగునాడు’ పేరు వెనుక అసలు ఆంతర్యం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును ‘తెలుగునాడు (Telugu Nadu) (నాడు=దేశం) తెలుగుదేశం (Telugu Desam)’ అని మార్చాలని గరికపాటి సూచించడం వెనుక రాజకీయ కోణం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలం నుండి ఉన్న ‘ఆంధ్ర’ (Andhra) అనే పదాన్ని కాదని, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే పేర్లను సూచించడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పేరు మారిస్తే ప్రజల జీవితాలు మారిపోతాయన్న ఆయన తర్కంపై సామాన్యులు సైతం సెటైర్లు వేస్తున్నారు.
వివాదాల వెల్లువ.. గత చరిత్ర ఇదే!
గరికపాటి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఏటా నిర్వహించిన ‘అలాయ్.. బలాయ్’ (Alai Balai) కార్యక్రమంలో ఫోటోలు దిగుతున్న చిరంజీవిని ఉద్దేశించి “ఆపకపోతే వెళ్ళిపోతా” అంటూ బాహాటంగా అవమానించారు. మెగా అభిమానుల ఆగ్రహానికి తలొగ్గి చివరకు క్షమాపణలు చెప్పారు.
కుల వివక్షపై వ్యాఖ్యలు.. గతంలో ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన గరికపాటి నరసింహారావుపై వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమాజిక వర్గానికి చెందిన వారంతా గరికపాటి ఇంటి ఎదుటే నిరసన తెలపడంతో తన ఇంటి ముందే బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన ప్రవచనకర్త, ఒక రాజకీయ పార్టీని భుజాన వేసుకొని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గరికపాటిపై ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నాయి.
గరికపాటికి ఎందుకింత చులకన?
వయస్సు పెరిగిన కొద్దీ విజ్ఞత పెరగాలి కానీ, గరికపాటి విషయంలో అది రివర్స్ అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదరికం అంటే ఆయనకు అంత చులకనా? సంప్రదాయాలను బోధించే వ్యక్తికి సామాజిక బాధ్యత అక్కర్లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రవచనాల ద్వారా గౌరవం సంపాదించుకున్న గరికపాటి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో తన ప్రతిష్టను తానే గంగలో కలుపుకుంటున్నారని చెప్పక తప్పదంటున్నారు. ఇకనైనా ఆయన తన వైఖరి మార్చుకోకపోతే, భవిష్యత్తులో ప్రజల నుంచి మరింత తీవ్రమైన వ్యతిరేకత తప్పదని హెచ్చరిస్తున్నారు.








