హైదరాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ముక్కుపచ్చలారని ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, అనంతరం హత్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. నార్సింగి ప్రాంతంలో నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితురాలి ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఒక వ్యక్తి బాలికకు చాక్లెట్ ఇస్తానని చెప్పి తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితుడు చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. బాలికపై లైంగిక దాడికి పాల్పడి, తరువాత బయటపడిపోతాననే భయంతో గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపాడు. అర్ధరాత్రి సమయంలో నిందితుడు చూపిన ప్రాంతంలో పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా వేగంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.








