ఇరాన్‌కు మద్దతు ప్రకటించిన పుతిన్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్న వేళ రష్యా (Russia) అధ్యక్షుడు ఇరాన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రష్యా తమ పూర్తి మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు పుతిన్ (Putin) స్పష్టం చేశారు.

ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా హుస్సేనీ ఖమేనీకి (Mojtaba Hosseini Khamenei) పుతిన్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రష్యా ఎల్లప్పుడూ ఇరాన్‌కు నమ్మకమైన భాగస్వామిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి (US–Israel Alliance) దాడుల మధ్య ఇరాన్‌కు రష్యా అచంచల మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ
ఇటీవల జరిగిన వైమానిక దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీని ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ (Iran Assembly of Experts) కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం తర్వాత పుతిన్ స్పందిస్తూ మొజ్తాబా తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లి దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరాన్‌కు కీలక నిఘా సహాయం?
రాజకీయ మద్దతుతో పాటు రష్యా ఇరాన్‌కు కీలక సమాచార సహాయం కూడా అందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకల కదలికలపై ప్రత్యక్ష నిఘా సమాచారాన్ని ఇరాన్‌కు అందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment