చరిత్ర సృష్టించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ భారత్ సొంతం

భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ క్రికెట్‌పై తన ముద్ర వేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లక్షలాది మంది అభిమానుల కేరింతలతో మారుమోగింది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఘోరంగా ఓడించిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్, మొత్తం మీద మూడోసారి ఈ ట్రోఫీని గెలుచుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది.

సంజూ తుఫాన్ ఇన్నింగ్స్… అభిషేక్, కిషన్ అద్భుత సహకారం
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఓపెనర్ సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరుకు బలమైన పునాది వేశాడు. అనంతరం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా అర్ధశతకాలతో మెరిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. వీరి దూకుడుతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ మూడు వికెట్లు తీసుకోగా రచిన్ రవీంద్ర, హెన్రీ తలో వికెట్ దక్కించుకున్నారు.

బుమ్రా, అక్షర్ బౌలింగ్‌కు కివీస్ లొంగిపోయింది
257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు ప్రారంభం నుంచే కఠిన పరీక్షగా మారారు. జస్ప్రీత్ బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ పటేల్ కూడా చక్కటి బౌలింగ్‌తో వరుసగా వికెట్లు పడగొట్టాడు. దీంతో కివీస్ జట్టు క్రమంగా కుప్పకూలింది.

న్యూజిలాండ్ తరఫున టిమ్ సీఫెర్ట్ 52 పరుగులు చేసి కొంత పోరాటం చేసినప్పటికీ అతనికి సరైన మద్దతు లభించలేదు. కెప్టెన్ శాంట్నర్ 43 పరుగులు చేసినా ఫలితం మారలేదు. చివరకు న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటగా, అక్షర్ పటేల్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. వరుణ్, హార్దిక్, అభిషేక్ తలో వికెట్ సాధించారు.

సంబరాల్లో మునిగిపోయిన అహ్మదాబాద్
భారత్ విజయం ఖాయం కావడంతో స్టేడియం మొత్తం ఆనందోత్సాహాలతో మారుమోగింది. బాణసంచా వెలుగులతో అహ్మదాబాద్ ఆకాశం నీలిమయంగా మెరిసిపోయింది. అభిమానుల “చక్ దే ఇండియా” నినాదాలతో వాతావరణం ఉత్సాహభరితంగా మారింది.

రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన సూర్యకుమార్ యాదవ్ తన తొలి ప్రధాన టోర్నీలోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి ప్రత్యేక గుర్తింపు పొందాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “ఈ విజయం మొత్తం జట్టు కృషి ఫలితం. ఆటగాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛే మాకు ఈ ఫలితాన్ని తీసుకొచ్చింది. ఈ ట్రోఫీని దేశ ప్రజలందరికీ అంకితం చేస్తున్నాం” అని భావోద్వేగంగా తెలిపాడు.

ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుని పొట్టి ఫార్మాట్‌లో తన అప్రతిహత ఆధిపత్యాన్ని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment