సుప్రీం కోర్టు పర్యవేక్షణలోని సీబీఐ సిట్ చార్జ్‌షీట్ బయటకొచ్చిన అనంతరం తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ఇప్పుడు ఆ స్థితి నుంచి బయటపడేందుకు ఎదురుదాడికి దిగిందని, లడ్డూ వివాదంలో పెరుగుతున్న విమర్శలు, భక్తుల ఆగ్రహం, వాస్తవాలు బయటకు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రాపగండా రాజకీయాలకు తెరలేపిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామాల్లో భాగంగానే నిన్న ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి సమావేశం ఒక రాజకీయ డ్రామాగా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ‘ఎదురుదాడి చేస్తే తప్ప ఈ వివాదం నుంచి బయటపడలేం’ అనే నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ నిర్ణయాల ఫలితమే నిన్నటి నుంచి తిరుమల లడ్డూ వ్యవహారంపై కొత్తగా విష ప్రచారం మొదలైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యేకంగా జాతీయ మీడియాను లక్ష్యంగా చేసుకుని లోకేష్ టీమ్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చెప్పాలనుకున్న కథనాన్ని జాతీయ స్థాయిలో నడిపించేందుకు ఈ ప్రయత్నాలు జరిగాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గత 24 గంటలుగా వాస్తవాలను మరుగునపెట్టి పచ్చి అబద్ధాలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే కథనాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి ప్రచార రాజకీయాలు తాత్కాలికంగా కూటమికి ఉపశమనం కలిగించవచ్చేమోగానీ, దీర్ఘకాలంలో తిరుమల శ్రీవారి ప్రతిష్టకు, లడ్డూ ప్రసాదం పవిత్రతకు తీవ్ర నష్టం కలిగిస్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కలియుగ దైవం తిరుమలేశున్ని వాడుకోవడం అత్యంత ప్రమాదకరమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే మహా పాతకం అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
లడ్డూ వివాదంలో నిజాలు తేలాల్సిన సమయంలో, ఎదురుదాడి పేరుతో విష ప్రచారాలకు పాల్పడటం సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుందని, ఇకనైనా కూటమి ప్రభుత్వం ఈ తీరును మానుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.








