తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని పేరుతో ఇంకెంతకాలం నీచ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పెద్దలు, మంత్రుల సమావేశం అనంతరం చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అబద్ధాలకు హద్దూ పద్దూ లేకుండా పోయిందని పేర్ని నాని మండిపడ్డారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన సీబీఐ సిట్ విచారణలో అలాంటి అంశం ఎక్కడా లేనప్పటికీ కావాలనే విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
నెయ్యి కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి
హర్ష్ డెయిరీ అంశాన్ని గుర్తు చేసిన పేర్ని నాని, చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఆ సంస్థ రంగప్రవేశం చేసిందని, అప్పట్లో ఇన్స్పెక్షన్ చేసి అన్ని సంతృప్తికరంగా ఉన్నాయని అనుమతులు ఇచ్చారని తెలిపారు. 291 రూపాయలకు నెయ్యి కొనుగోలు చేశారని ఇప్పుడు విమర్శించడం సరికాదని, తక్కువ ధరకు కొనుగోలు చేస్తే అది తప్పనిసరిగా కల్తీ అవుతుందా? అని ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు గత ప్రభుత్వ కాలంలో హెరిటేజ్ నెయ్యి రేట్లు ఎలా ఉన్నాయో చెప్పే ధైర్యం ఉందా? అంటూ సవాల్ విసిరారు.
దేవుడి పేరుతో రాజకీయాలు మానుకోవాలి
పవన్ కళ్యాణ్ ఉచ్ఛం–నీచం తెలియకుండా మాట్లాడుతున్నారని, ఒక్కో దశలో ఒక్కో మతాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్ని నాని విమర్శించారు. జగన్‌ను ఓడించలేక నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో సుమారు 50 ఆలయాలు ధ్వంసం చేయగా, వాటిని వైఎస్ జగన్ ప్రభుత్వం తిరిగి పునఃప్రతిష్ట చేసిందని గుర్తు చేశారు. తిరుమలకు రెండు కొండలేనని చంద్రబాబు మనిషే కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఏడు కొండలుగా గుర్తిస్తూ జీవో ఇచ్చింది వైఎస్సార్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
సీబీఐ రిపోర్ట్‌నే నిజం
సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన సీబీఐ సిట్ విచారణలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎక్కడా తేలలేదని, ఆ రిపోర్టులో వైఎస్ జగన్ లేదా వైవీ సుబ్బారెడ్డి పేర్లు కూడా లేవని పేర్ని నాని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొత్త కమిషన్ పేరుతో మరోసారి రాజకీయ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లు క్వాలిటీ లేనివని వెనక్కు పంపామని అప్పట్లో అధికారులే చెప్పారని, ఇప్పుడు వాటినే లడ్డూలకు వాడారంటూ కథలు అల్లడం దుర్మార్గమని విమర్శించారు. తిరుమల ప్రతిష్టను రాజకీయాల కోసం మంటగలపవద్దని హెచ్చరించారు.
దేవుడే తగిన బుద్ధి చెబుతాడు
చివరగా పేర్ని నాని మాట్లాడుతూ, తిరుమలను అల్లరి చిల్లరగా చేయవద్దని, జరుగుతున్న అపచారాలను అరికట్టేందుకు హిందూ మత పెద్దలు, ప్రవచనకారులు ముందుకు రావాలని కోరారు. దొంగే దొంగ అన్నట్లుగా మాట్లాడుతున్నారని విమర్శిస్తూ, దేవుడే వీరందరికీ తగిన బుద్ధి చెబుతాడని వ్యాఖ్యానించారు.








